AP Auto Drivers: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ఈ సందర్భంగా ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ పేరిట నిర్వహించిన కార్యక్రమం సక్సెస్ అయ్యింది. పలు అంశాలపై క్లారిటీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న క్రమంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రికార్డు స్థాయిలో జనాలు హాజరయ్యారు. అందులోనూ రాయలసీమలో సత్తా చాటారు. రాయలసీమ అంటే ముందుగా గుర్తుకొచ్చేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రాయలసీమలో దివంగత రాజశేఖరరెడ్డి కుటుంబానికి గట్టిపట్టు ఉంది. ప్రస్తుత సీఎం చంద్రబాబు రాయలసీమకు చెందిన వ్యక్తి అయినా.. తనకంటూ ముద్ర చాటుకుంటూ వస్తోంది వైయస్సార్ కుటుంబం. అటువంటి కుటుంబ ఆధిపత్యాన్ని దాటుకుంటూ వచ్చింది కూటమి. 52 అసెంబ్లీ సీట్లు ఉన్న రాయలసీమలో 45 సీట్లు సొంతం చేసుకుంది. కేవలం ఏడు స్థానాలకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసింది. అయితే 15 నెలల పాలనలో తనకంటూ ముద్ర చాటుకుంది కూటమి ప్రభుత్వం. అందుకే అనంతపురం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే కూటమి ప్రభుత్వ ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ దానిని తిప్పి కొట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వంపై పూర్తిగా నమ్మకం ప్రకటించారు. మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సైతం కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ చేసిన ప్రకటనలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
* ఆర్టీసీలో ఉచిత ప్రయాణం నేపథ్యంలో..
కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీఎస్ఆర్టీసీలో ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుతోంది. ఏపీ వ్యాప్తంగా ఈ పథకంపై సానుకూలత వ్యక్తం అవుతోంది. మహిళలు పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ పథకం పై ఎన్ని రకాల ప్రచారం చేసిన అది ప్రజలు నమ్మడం లేదు. అయితే ఈ పథకంతో ఆటో డ్రైవర్లతోపాటు ప్రైవేటు వాహనదారులకు నష్టం కలుగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. గతంలో ఆటో డ్రైవర్లకు అమలు చేసిన వాహన మిత్ర పథకం గురించి ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.
* తెరపైకి వాహన మిత్ర పథకం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాహన మిత్ర పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్, యజమానికి ఏడాదికి పదివేల రూపాయలు ప్రోత్సాహం కింద అందించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఈ పథకంపై భిన్న స్పందన వినిపించింది. కానీ ఇప్పుడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తుండడంతో ప్రైవేటు వాహనదారులకు ఇబ్బందికర పరిణామంగా మారింది. ఎందుకంటే ఎప్పటి వరకు ప్రైవేటు వాహనాలపై ఆధారపడే మహిళలు.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఎక్కువమంది అటువైపు మొగ్గు చూపారు. అదే సమయంలో ఆటోలతో పాటు ప్రైవేటు వాహనాలకు ఆదరణ తగ్గింది. మరోవైపు ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అందకుండా పోయింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తుండడంతో విపక్షాలకు ఆటోడ్రైవర్లు ఒక ప్రచార అస్త్రంగా మారారు. ఉచిత ప్రయాణ పథకంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం ప్రారంభించింది. దీంతో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అందుకే దసరా నుంచి ఆటో డ్రైవర్లకు నగదు సాయం చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. వాస్తవానికి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేసిన క్రమంలోనే.. ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏదో ఒక ఆర్థిక సాయం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు అనంతపురంలో కూటమి సక్సెస్ సభ సందర్భంగా దసరా నుంచి ఆటో డ్రైవర్లకు నగదు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే ఆటో డ్రైవర్లకు ఉపశమనం కలిగిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.