AP DSC 2024 : కూటమి ప్రధాన హామీలో డీఎస్సీ ఒకటి. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తొలి ఫైల్ పై సంతకం చేశారు.జగన్ సర్కార్ ఇచ్చిన 6000 పోస్టులకు.. మరో 10 వేల పోస్టులు జత కలుపుతూ 16 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెప్పారు. క్యాబినెట్లో సైతం ఆమోదం తెలిపారు. కానీ ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు నోటిఫికేషన్ మాత్రం ప్రకటించలేదు. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే లక్షలాదిమంది అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలామంది ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెబుతోంది.
* ఎస్సీ వర్గీకరణతో
అయితే డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటనలో జాప్యానికి ప్రధాన కారణం ఎస్సీ వర్గీకరణ. వాస్తవానికి నవంబర్ 4న డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ చంద్రబాబును కలిశారు. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత డీఎస్సీ ప్రకటించాలని కోరారు. అప్పుడే దళిత వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటనను వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎస్సీ వర్గీకరణ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పట్లో పూర్తవుతుందా? అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ తరుణంలో డీఎస్సీ అభ్యర్థులు కూడా ఎంతో ఆందోళనతో ఉన్నారు.
* అనేక రకాల జాగ్రత్తలు
అయితే ఈ డీఎస్సీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఎటువంటి న్యాయ చిక్కుళ్ళు లేకుండా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది. ఒకవేళ డీఎస్సీ ప్రకటన చేసినా.. అడ్డంకులు సృష్టించేందుకు చాలామంది ప్రయత్నిస్తారు. న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. అందుకే వీలైనంత త్వరగా ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి.. డీఎస్సీ ప్రకటించాలన్నది సర్కార్ వ్యూహంగా తెలుస్తోంది. దీనిని ధ్రువీకరించారు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ విచారణ కొనసాగుతోందని.. అది పూర్తయ్యాక డీఎస్సీ వర్గీకరణ పై స్పష్టత వస్తుందని.. ఆ తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.