Nandhamuri Balakrishna : అమరావతి రాజధాని నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల సిఆర్టిఏ భవన నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. జనవరి నుంచి పూర్తిస్థాయిలో నిర్మాణాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు మంజూరు కానున్నాయి. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని టిడిపి కూటమి ప్రభుత్వం భావిస్తోంది.మరోవైపు అమరావతిలో ప్రైవేటు కంపెనీలకు,సంస్థలకు భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. వారంతా తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఆసుపత్రి చైర్మన్,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఆదివారం అమరావతి రాజధాని ప్రాంతాన్ని పరిశీలించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. త్వరలో పనులు మొదలు పెడతామని చెప్పారు.
* తొలి ప్రైవేట్ నిర్మాణం
అమరావతిలో తొలి ప్రైవేటు నిర్మాణం కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కావడం గమనార్హం. 2017లో ఇక్కడ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించింది.అప్పట్లో లీజుకు సంబంధించిన సొమ్మును బాలయ్య చెల్లించారు. పనుల నిర్మాణం చేపట్టే సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. దీంతో అన్ని ప్రాజెక్టులు మాదిరిగానే బాలయ్య ఆసుపత్రి నిర్మాణం పనులు కూడా నిలిచిపోయాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అమరావతి నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేంద్ర సాయంతో 15 వేల కోట్లు, సొంతంగా మరో 12 వేల కోట్లు, నాబార్డు ద్వారా మరో 15 వేల కోట్ల రూపాయల తీసుకుని రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా జరిపించాలని భావిస్తోంది.
* అమరావతి బాటపడుతున్న సంస్థలు
మరోవైపు గతంలో దూరమైన ప్రైవేటు కంపెనీలు, సంస్థలు తిరిగి అమరావతి బాట పడుతున్నాయి. అందులో భాగంగా బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రికి కేటాయించిన భూములను పరిశీలించారు. ఇప్పటికీ అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి.ఈ నేపథ్యంలో పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. అందులో భాగంగానే సిఆర్డిఏ అధికారులతో కలిసి బాలకృష్ణ ఆ భూములను పరిశీలించినట్లు సమాచారం. ఈనెల చివరిలో ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అమరావతిలో ఏర్పడే తొలి ప్రైవేట్ నిర్మాణం కూడా ఇదే అవ్వనుంది.