
కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జగన్ సర్కార్ తీసుకున్న చర్యలు, ప్రజలు విధిగా కరోనా నిబంధనలు పాటించడం వల్ల కేసుల సంఖ్య, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించే అవకాశాలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటోంది.
ఇప్పటికే పలు సంస్థలు వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి తెస్తామని కీలక ప్రకటనలు చేసిన నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన విధివిధానాలను పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది. కేంద్రం సూచనల మేరకు జగన్ సర్కార్ రాష్ట్రంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మొత్తం 18 మంది సభ్యులు ఉండనున్నారు. ఈ కమిటీ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు చేయనుంది.
ప్రభుత్వం స్టీరింగ్ కమిటీ ద్వారా వ్యాక్సిన్ పంపిణీ కొరకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ కమిటీకి ఛైర్ పర్సన్ గా వ్యవహరించనున్నారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్ గా ఉండనున్నారు. వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఈ కమిటీకి సభ్యులుగా ఉన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ ఈ కమిటీ నెల రోజులకు ఒకసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో వచ్చినా ప్రజలకు వేగంగా వ్యాక్సిన్ పంపిణీ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.