Lakshmi Naidu Case: ఏపీలో ( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది. ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. గత 16 నెలల పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం బాగుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున అభివృద్ధిని విద్యాధికులు, చదువుకున్న వారు ఆహ్వానిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు ఎలాను వ్యతిరేకిస్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాయి. అంతమాత్రానికి ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోవడం అనేది ఇబ్బందికరమే. తాజాగా రాజకీయ గొడవలకు సంబంధించి బాధితులకు పరిహారాలు ఇవ్వడం అనే సంప్రదాయం మాత్రం విమర్శలకు తావిస్తోంది. అది కూడా ప్రభుత్వం తరఫున సాయం ప్రకటిస్తుండడం మాత్రం కాస్తా ఇబ్బందికరమే. కందుకూరు ఘటనకు సంబంధించి లక్ష్మయ్య నాయుడు హత్య కుల రాజకీయాలను పులుముకుంది. దానిని అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం లక్ష్మయ్య నాయుడు కుటుంబానికి భూమితో పాటు పరిహారం అందించడం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. ఇది ఆర్థికపరమైన హత్య అని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక విభేదాలతోనే ఈ ఘటన జరిగినట్లు చెప్పుకొస్తోంది. కానీ వైసీపీ మాత్రం ఇది కుల హత్యగా చెబుతోంది.
రెండు కులాల మధ్య సమన్వయం..
మొన్నటి ఎన్నికల్లో కాపు( Kapu ), కమ్మ సామాజిక వర్గాలు సంఘటితం అయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చేందుకు కారణం అయ్యాయి. అయితే ఆది నుంచి ఈ రెండు సామాజిక వర్గాలు అవసరాల రీత్యా కలుస్తూ ఉంటాయి. ఇలా కలిసే క్రమంలో తెలుగుదేశం పార్టీకి ఘనవిజయం దక్కుతూ వస్తోంది. అయితే ఈసారి టిడిపి తో పాటు జనసేనకు ఈ రెండు వర్గాలు అండగా నిలిచాయి. టిడిపి అధికారంలోకి వచ్చేందుకు ఈ కలయిక దోహదపడగా.. జనసేన సంపూర్ణ విజయాన్ని సాధించేందుకు కూడా కారణం అయింది. అయితే ఈ రెండు సామాజిక వర్గాలను విడగొట్టాలన్నది వైసిపి ప్లాన్. అందుకే శాసనసభలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను సైతం కులం రంగును అంటగట్టారు. ఇప్పుడు ఆర్థిక విభేదాలతో జరిగిన లక్ష్మయ్య నాయుడు హత్యను సైతం కుల హత్యగా చిత్రీకరించారు. కానీ వీటిని చల్లార్చే క్రమంలో ప్రభుత్వం తరఫున పరిహారం అందించడం మాత్రం కొత్త వివాదాలకు కారణం అవుతోంది.
* వైసీపీకి అత్యవసరం..
వాస్తవానికి వైసిపి( YSR Congress party ) అధికారంలో లేదు. ఆ పార్టీకి ఇప్పుడు కుల చిచ్చు అనేది అత్యవసరం. అర్జెంటుగా కాపులు కూటమిని విభేదించాలి. కమ్మ సామాజిక వర్గాన్ని ద్వేషించాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నయం అన్న నిర్ణయానికి రావాలి. అందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో తెలియంది కాదు. 2014 నుంచి 2019 మధ్య కాపులను టిడిపి పై ఎగదోశారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయంగా అండగా నిలిచేందుకు పవన్ ఉన్నారు. అభివృద్ధిలో చంద్రబాబు తన మార్కు చూపిస్తున్నారు. ఇటువంటి క్రమంలో ఏ చిన్న ఘటన జరిగినా దాని చుట్టూ కులం రంగు పులమడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆవశ్యంగా మారింది. అయితే ఇటువంటి క్రమంలో ప్రభుత్వం తరఫున ఇటువంటి ఘటనలకు పరిహారం ప్రకటించడం పై విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై మాట్లాడారు ఇంటలిజెన్స్ మాజీ చీఫ్, మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. రాష్ట్రవ్యాప్తంగా 900 వరకు ఇటువంటి ఘటనలు జరిగాయని.. ప్రభుత్వం తరుపున పరిహారం ఇస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. అయితే అది కూడా నిజమే. కానీ లక్ష్మయ్య నాయుడు హత్యను ఒక పద్ధతి ప్రకారం కుల హత్యగా చిత్రీకరించేందుకు వైసిపి ప్రయత్నించింది. దానిని ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని చెప్పి బాధిత కుటుంబంతోనే గతంలో జరిగిన వివాదాలు గురించి చెప్పించారు. ఆర్థికపరమైన ఘటన కావడంతో పరిహారం ఇచ్చారు. అయితే ఇటువంటి ఘటనల విషయంలో బాధితులకు అండగా న్యాయ సహాయం చేయలే కానీ.. పరిహారం అనేది సహేతుకం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.