Aarogyasri Network Hospitals: ఏపీలో( Andhra Pradesh) ఆరోగ్యశ్రీ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతగానో గుర్తింపు తెచ్చింది ఈ పథకం. అందుకే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం దీనిని కొనసాగించాయి. ఆరోగ్యశ్రీ పరిధిలో రోగాలను కూడా ఎక్కువగా చేర్చాయి. అయితే ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా పరిణమించింది. ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు ఎక్కువగా పేరుకుపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన నాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. ఆ బకాయిలు తీర్చుతూ కొత్త చెల్లింపులు చేస్తూ వచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలకు బకాయిలు చేరడంతో నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా 13 రోజులపాటు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిరసన తెలపడం ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు ఏకంగా విజయవాడలో ఆందోళనలు జరిపించేందుకు నెట్వర్క్ ఆసుపత్రులు ముందుకు రావడం విశేషం.
* బకాయిలు సర్వసాధారణం..
రెండు దశాబ్దాలకు పైగా ఏపీలో ఆరోగ్యశ్రీ( aarogya Sri ) అమలవుతోంది. కానీ బకాయిలు అనేది సర్వసాధారణం. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేయడం, సమ్మెకు దిగుతామని హెచ్చరించడం, ప్రభుత్వం బకాయిలు చెల్లించడం పరిపాటిగా వస్తోంది. కానీ ఈసారి గతానికి భిన్నంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల వ్యవహారం నడుస్తోంది. ఒకవైపు సమ్మె కొనసాగిస్తుండగా.. ఇంకోవైపు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతుండడం విశేషం. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు యూనియన్లు మద్దతు తెలుపుతుండడం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. తద్వారా నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ విషయంలో బాగా తెగించినట్లు కనిపిస్తోంది. అయితే ఇది రాజకీయాలకు అతీతమైన పోరాటమని.. రెండు దశాబ్దాల పాటు ఈ పథకం విషయంలో ఉదాసీనంగా వ్యవహరించమని.. ఇక మా వల్ల కాదు అంటూ తేల్చి చెబుతున్నాయి నెట్వర్క్ ఆసుపత్రులు.
* రాజశేఖర్ రెడ్డి హయాంలో..
2007లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు రాజశేఖరరెడ్డి( y s Rajasekhar Reddy ). అయితే ఈ పథకంలో ద్రవయోల్పనం ప్రకారం ప్యాకేజీ రేట్ల సవరణలు అతి తక్కువగా జరిగాయి. అదే సమయంలో వైద్య చికిత్సలకు అవసరమయ్యే పరికరాలు, మందుల ధరలు పెరిగాయి. ఇది నెట్వర్క్ ఆసుపత్రులకు భారంగా మారింది. ప్రస్తుతం ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి లేకుండా చిన్నపాటి ఆసుపత్రి కూడా ప్రారంభించలేని స్థితి. అందుకే బకాయిల చెల్లింపు తో పాటు ప్యాకేజీ ధరలు పెంచాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. సందట్లో సడే మియా అన్నట్టు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై హడావిడి చేస్తోంది. వాస్తవానికి అత్యధిక బకాయిలు పెట్టింది వైసీపీ ప్రభుత్వమే. 2024 జూన్లో అధికారానికి దూరమైంది వైసిపి. ఆ సమయానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు అక్షరాల 2000 కోట్ల రూపాయలు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిలు 700 కోట్ల రూపాయలను చెల్లించింది. అదే సమయంలో తమ హయాంలో జరిగిన చికిత్సలకు చెల్లింపులు చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం బకాయిలు 3000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అయితే జగన్ హయాంలో సమ్మె అంటూ హడావిడి చేశారు. అయితే అప్పట్లో దూకుడు మీద ఉండేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అందుకే ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి పరిష్కార మార్గం చూపుతుందో చూడాలి.