AP Free Bus: ఏపీలో( Andhra Pradesh) ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ కనిపిస్తోంది. రోజురోజుకు ప్రయాణించే మహిళల సంఖ్య పెరుగుతోంది. అయితే పెరుగుతున్న మహిళల రద్దీతో ఇతర ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా పురుషులకు కష్టాలు మొదలయ్యాయి. డబ్బులు చెల్లించి బస్సులు ఎక్కితే.. పురుషులకు సీట్లు దొరకడం లేదు. పైగా పురుషులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కొన్ని చోట్ల ఏకంగా దాడి చేస్తున్న వైనాలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయి కూడా.
బస్సుల్లో రద్దీ..
ఏపీలో ఉచిత ప్రయాణ పథకంతో( free travelling scheme) బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో పురుషులు, దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం మంచి నిర్ణయమే.. కానీ పురుషులకు కూడా సీట్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బస్సులు మొత్తం మహిళలతోనే నిండిపోతున్నాయని.. తమకు కనీస స్థాయిలో సీట్లు ఇవ్వడం లేదని పురుషులు వాపోతున్నారు. కొన్ని బస్సుల్లో అయితే కనీసం నిల్చోనేందుకు కూడా వీలుండడం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత సర్వీసులో ఈ ఇబ్బందికర పరిస్థితులు అధికంగా ఉన్నాయి.
ఆ సర్వీసుల్లోనే ఇబ్బందులు..
సాధారణంగా పల్లె వెలుగు( Palle Velugu ) సర్వీసుల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ఆపై విద్యార్థులు సైతం ప్రయాణిస్తుంటారు. ఉచిత ప్రయాణం నేపథ్యంలో మహిళలు కనీసం ఆటోల ముఖం చూడడం లేదు. ఎంత సమయమైనా వేచి చూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో బస్సుల్లో ఇతర వర్గాలకు సీట్లు దొరకడం లేదు. అందుకే అదనపు సర్వీసులు నడపాలని డిమాండ్ వినిపిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ పథకానికి తాము వ్యతిరేకం కాదని.. కానీ పురుషుల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పురుషుల బాధను అర్థం చేసుకొని అదనంగా సర్వీసులు అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీ ఒక నివేదిక అందించింది. గతంలో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య 40 శాతంగా ఉండేదని.. ఇప్పుడది 65 శాతానికి పెరిగింది అన్నది ఆ నివేదికల సారాంశం. అయితే ఇప్పటికిప్పుడు బస్సుల సంఖ్యను పెంచే అవకాశం కనిపించడం లేదు. త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వచ్చే సూచన ఉంది. మరోవైపు ప్రాధాన్యత క్రమంలో బస్సుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.