AP faces cyclone threat: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ముందుగా బంగాళాఖాతాన్ని( Bay of Bengal ) తాకాయి. తరువాత దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ రీజియన్, బంగాళాఖాతం దక్షిణ- మధ్య ప్రాంతం, ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో చురుగ్గా కదులుతున్నాయి. వీటికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఏపీకి సంబంధించి ముందుగా రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మిగతా ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ.
* ఒడిస్సా తీరం వెంబడి..
ఒడిస్సా( Odisha ) తీరం వెంబడి వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం మంగళవారం ఉదయం ఒడిస్సా తీరం వెంబడి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో సైతం తేలికపాటి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వచ్చే రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
* ఈరోజు భారీ వర్షాలు..
మరోవైపు ఈరోజు సైతం ఏపీకి( Andhra Pradesh) భారీ వర్ష సూచన ఉంది. శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైయస్సార్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలకు అవకాశం ఉన్నందున.. గోదావరి, నాగావళి, వంశధార నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.
* హోం మంత్రి అత్యవసర సమీక్ష..
భారీ వర్షాల నేపథ్యంలో హోం శాఖామంత్రి వంగలపూడి అనిత( home minister Anita) ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల యంత్రాంగాలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. సరస్సులు, చెరువులను తక్షణమే గుర్తించి వాటి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఎస్పీలను అప్రమత్తం చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గత ఏడాది భారీ వర్షాలకు ప్రాణ నష్టం జరిగింది. మరోసారి అదే పరిస్థితి రాకుండా ఉండేందుకు ముందుగానే అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం.