AP Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు( Government employees) గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం డబ్బులను అకౌంట్లో జమ చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జిఎల్ఐ, జిపిఎఫ్ బకాయిలను ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్ లలోకి జమ చేయడం ప్రారంభించింది. ఈరోజు ఉదయం 11:30 గంటల నుంచి ఉద్యోగుల అకౌంట్లో బకాయిలకు సంబంధించి డబ్బులు పడుతున్నాయి. మొత్తం 6200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. నేటి నుంచి బుధవారం వరకు మొత్తం పూర్తిస్థాయిలో నిధుల విడుదల అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల అకౌంట్లో డబ్బులు జమవుతున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలకు కూడా తెలియజేసింది ఏపీ ప్రభుత్వం. తమ బకాయిలను విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సిఎస్ విజయనంద్ లకు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: జగన్ అడ్డాలో క్యాంపు పాలిటిక్స్.. గట్టిగానే కూటమి సవాల్!
* వారం రోజుల కిందట సీఎం ఆదేశాలు
వారం రోజుల కిందట సీఎం చంద్రబాబు( CM Chandrababu) స్పష్టమైన ప్రకటన చేశారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 6200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఉద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతున్నారు చంద్రబాబు. సిపిఎస్, ఏపీ జిఏఐ కింద ఆర్థిక శాఖ ఈ మొత్తం క్లియర్ చేసింది. దీంతో ఉద్యోగుల అకౌంట్లో నగదు జమ అవుతుంది. ఈ ఏడాది జనవరి నెలలో కూడా ఉద్యోగులకు బకాయి కింద రూ.1033 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
* ఉద్యోగ సంఘాల నేతల హర్షం..
ఉద్యోగుల బకాయి విడుదల చేసిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి( KV Siva Reddy ) స్పందించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు జనవరిలో రూ. 1033 కోట్లు, తాజాగా మరో రూ.6200 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం బకాయిల చెల్లింపునకు ముందుకు రావడంతో ఉద్యోగుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది. అయితే మిగతా బకాయిలు సైతం వీలైనంత త్వరగా చెల్లింపులు చేయాలని కోరుతున్నారు ఉద్యోగులు.
* గత ఐదేళ్లలో ఆందోళనలు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జీతాలు ఆలస్యం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సకాలంలో వారికి చెల్లింపులు చేయలేదు. పైగా ఉద్యోగులు అంటే ప్రభుత్వ వ్యతిరేక వర్గం అనే ముద్ర వేశారు. ఉపాధ్యాయులతో సైతం సమస్యలు తెచ్చుకుంది నాటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. అది కూటమికి ప్లస్ పాయింట్ గా మారింది. సాధారణ ఎన్నికల్లో కూటమికి అండగా నిలిచింది ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గం. దానిని అలానే కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ బకాయిల చెల్లింపులు అని తెలుస్తోంది.