CM Chandrababu: చంద్రబాబు పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. చాలా శాఖల్లో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది తెచ్చిపెట్టాయి. ప్రజలను దూరం చేశాయి. కానీ ఆ సంస్కరణల ఫలితాలను ఇప్పుడు ఏపీ అనుభవిస్తోంది. 1995- 2004 మధ్య విద్యుత్ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చారు చంద్రబాబు. రాజకీయంగా అవి విపరీతమైన ప్రతికూలతను చూపాయి. 2004 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2009లో సైతం అధికారం దక్కలేదు. ప్రజల్లో చంద్రబాబుపై ఒక రకమైన భావన ఏర్పడడానికి విద్యుత్ సంస్కరణలే కారణమని విశ్లేషణలు కూడా వచ్చాయి. సిఐఐ సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు చంద్రబాబు.
1999 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అప్పటికే రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దానిని గాడిలో పెట్టాలని భావించారు చంద్రబాబు. అయితే విద్యుత్ ద్వారా ఆదాయం పెరిగితే కానీ సంస్కరణలు అమలు చేయలేమని భావించారు. విద్యుత్ చార్జీలు పెంచడంతోపాటు విద్యుత్తు చౌర్యం పై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వ్యవసాయానికి ఏడు గంటలపాటు మాత్రమే విద్యుత్ అందించగలిగారు . అయితే నాడు ఈ నిర్ణయాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచాయి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. ఈ క్రమంలోనే హైదరాబాదులోని బషీర్బాగ్ వద్ద కాల్పులు జరిగాయి. ఆందోళనకారులు చనిపోయారు. చంద్రబాబు సర్కార్ పై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అయ్యాయి. సదుద్దేశంతో పెట్టిన విద్యుత్ సంస్కరణలపై ప్రజలు వ్యతిరేకత కనబరిచారు. అందుకే 2004 ఎన్నికల్లో అధికారానికి దూరం చేశారు.
అయితే కేవలం విద్యుత్ సంస్కరణల వల్లే చంద్రబాబు సర్కార్ పై వ్యతిరేకత పెరిగిందని నాడు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. పాదయాత్ర చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి విద్యుత్ విషయంలో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తించారు. అందుకే తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తో పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైల్ పై తొలి సంతకం చేశారు. నాటి నుంచి ఉచిత విద్యుత్ అమలవుతూ వస్తోంది. కానీ వ్యవసాయ పంపుసెట్లకు తొలిసారిగా జగన్ విద్యుత్ మీటర్లను అమర్చారు. అదాని కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత వచ్చిన ఈ ముఖ్యమంత్రి వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చేందుకు సాహసించలేదు. జగన్ సర్కార్ పై వ్యతిరేకతకు ఇది ఒక కారణమైంది. ఈ ఎన్నికల్లో జగన్ ఓటమికి దోహద పడింది.
ఇటీవల చంద్రబాబు విద్యుత్ శాఖ పై శ్వేత పత్రం విడుదల చేశారు. తన పాలనలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ సర్కార్ గత ఐదేళ్లలో విద్యుత్ సంస్థలపై 1.29 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గతఐదు సంవత్సరాలుగా విద్యుత్ టారిఫ్ కూడా పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. విద్యుత్ సంస్థలు నష్టాలు చవిచూశాయని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు సిఐఐ సదస్సులో కూడా విద్యుత్ శాఖ పైనే ఎక్కువ శాతం మాట్లాడారు. తాను చేపట్టిన విద్యుత్ సంస్కరణల ఫలితంగానే దేశంలో విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు. విద్యుత్ సంస్కరణలతో మా ప్రభుత్వం ఓడిపోయినా.. విద్యుత్ సంస్కరణలు గెలిచాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏపీకి విద్యుత్ మిగులు కూడా వచ్చిందని.. నాటి సంస్కరణల పుణ్యంతోనే ఇది సాధ్యపడిందని చంద్రబాబు ప్రకటించడం విశేషం.