Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: బ్రాండ్ చంద్రబాబు : ఏపీకి పారిశ్రామికవేత్తల రాకకు అసలు కారణాలు ఇవీ

CM Chandrababu: బ్రాండ్ చంద్రబాబు : ఏపీకి పారిశ్రామికవేత్తల రాకకు అసలు కారణాలు ఇవీ

CM Chandrababu: చంద్రబాబుకు ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఉంది. రాజకీయంగా ఆయనపై అభ్యంతరాలు ఉన్న.. పాలన విషయంలో మాత్రం ప్రత్యర్థులు సైతం జై కొడతారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారని ఆయనకు మంచి పేరు ఉంది. అదే సమయంలో వ్యవసాయం వంటి రంగాలకు చిన్న చూపు చూస్తారని కూడా విమర్శ ఉంది. అదే రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. అందుకే ఈసారి చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. పారిశ్రామికంగా నవ్యాంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్లడంతో పాటు వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎవరికి ఎన్ని అభ్యంతరాలు ఉన్నా హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఐటీ హబ్ గా మార్చడంతో పాటు ఐఎస్బి, ఐఐఐటి వంటి అనేక అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలను ఆహ్వానించేవారు. వారికి విందు ఇచ్చి ఆయనే స్వయంగా వడ్డించేవారు. అప్పుడే ఆయనకు రాష్ట్రానికి సీఈవో అని పేరు వచ్చింది. అప్పటికి పారిశ్రామిక ర్యాంకుల్లో 22వ స్థానంలో ఉండే ఏపీ.. చంద్రబాబు కృషితో నాలుగో స్థానానికి ఎగబాకింది. నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబును ఐఎస్బి వంటి సంస్థలు ప్రత్యేక ఉత్సవాలకు గెస్ట్ గా పిలిచాయి అంటే.. ఆయన ముద్ర ఎలాంటిదో అర్థమవుతుంది.

తాజాగా నవ్యాంధ్రప్రదేశ్ లో రెండోసారి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ మరు క్షణం నుంచి పారిశ్రామిక కార్యాచరణను ప్రారంభించారు. గత అనుభవాలను రంగరించుకొని పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. తాజాగా సిఐఐ సమావేశం వేదికగా దేశీయ, విదేశీ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. భూ కేటాయింపులతో పాటు రాయితీలు కూడా అందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే పారిశ్రామిక ఆలోచన అనేది ఇప్పటిది కాదు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబితే.. వారిలోని ఆత్మవిశ్వాసాన్ని, ప్రతిభ పాఠవాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన నాయకుడు మాత్రం చంద్రబాబు. ఐటీ జ్ఞానిగా, ఈ గవర్నెన్స్ ను ప్రజలకు పరిచయం చేసింది ఆయనే. చంద్రబాబు సీఎంగా ఉండగానే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్, సింగపూర్ ప్రధాని, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ లాంటివారు ఆంధ్రప్రదేశ్ ను సందర్శించారు. బిల్ గేట్స్ వెంటపడి ఒప్పించి మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని హైదరాబాదులో ప్రారంభించేలా చంద్రబాబు కృషి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించేది చంద్రబాబు. నగరికరణతో పాటు పారిశ్రామికీకరణ రాష్ట్ర ప్రగతికి దోహదపడుతుందని చంద్రబాబు భావిస్తుంటారు. చంద్రబాబు పారిశ్రామిక విజినరీతో ముందుకెళ్లగా.. రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకే చంద్రబాబు అంటే పారిశ్రామికవేత్తలకు ఒక రకమైన నమ్మకం.

గత ఐదు సంవత్సరాలుగా పారిశ్రామికంగా ఎటువంటి ప్రగతి లేదన్న విమర్శ ఉంది. ఉన్న పరిశ్రమలు సైతం తరలి వెళ్లిపోయాయని అపవాదు జగన్ సర్కార్ పై ఉంది. దీంతో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. అందుకే ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా పరిశ్రమల ఏర్పాటు పై దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సైతం పెట్టుబడులు ఆశిస్తున్నారు. 60 వేల కోట్లతో బిపిఎల్ రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో.. రాష్ట్రంలో భూసేకరణతో పాటు రాయితీలు కల్పిస్తామని వారికి భరోసా ఇచ్చారు. మచిలీపట్నంలో కానీ పిఠాపురంలో కానీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమరావతిలో ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూముల్లో సంస్థల ఏర్పాటుకు సంబంధించి శరవేగంగా పావులు కదుపుతున్నారు. విద్య, వైద్యం, టూరిజం, వాణిజ్యం ప్రాజెక్టులకు సంబంధించి పెద్ద ఎత్తున భూములు కేటాయించారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా అమరావతి నిర్వీర్యం అయింది. దానికి రెండు నెలల్లో మంచి రూపం తెచ్చి సంబంధిత సంస్థలకు అప్పగించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒక్క అమరావతి లోనే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు చంద్రబాబు. అందులో భాగంగానే సిఐఐ సదస్సులో కీలక ప్రసంగం చేశారు. గతంలో తాను పారిశ్రామిక విధానంలో అనుసరించిన తీరును పారిశ్రామికవేత్తలకు వివరించారు. సరైన ప్రణాళిక, పెట్టుబడులతో ముందుకు వస్తే ఏపీ స్వర్గధామంగా నిలుస్తుందని కూడా వారికి హామీ ఇచ్చారు. అయితే పారిశ్రామిక రంగంలో చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు ఏపీకి అక్కరకు వస్తోంది. పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూసేలా చేస్తోంది. చంద్రబాబు పాలనకు ఇంకా 59 నెలలసమయం ఉంది. అందుకే ఎక్కువమంది చంద్రబాబును నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular