AP Elections 2024: ఏపీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. కూటమి వెర్సెస్ వైసీపీ అన్న రేంజ్ లో పరిస్థితి ఉంది. మధ్యలో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. మూడు పార్టీలు కలిపి కూటమి కట్టగా.. కాంగ్రెస్ సైతం వైసీపీ నే టార్గెట్ చేసుకుంది. ఒక యుద్ధ వాతావరణం తలపిస్తోంది. అయితే సింహం ఒకవైపు.. మిగతావారు ఒకవైపు అన్నట్టు వైసిపి జగన్ ను ఉద్దేశించి ప్రచారం చేసుకుంటుంది. జగన్ ఒక్కరే చాలని.. తమకు ఏ స్టార్ క్యాంపైనర్లు అవసరం లేదని.. సామాన్య జనాలే మా స్టార్ క్యాంపెయినర్లని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. తాము ఒంటరి ప్రచారం చేసినా ప్రజలు తమను ఆదరిస్తారని కూడా నమ్మకం పెట్టుకున్నాయి.అయితే ఇక్కడే రకరకాల అనుమానాలు బలపడుతున్నాయి.
కూటమి గురించి ప్రస్తావిస్తే చంద్రబాబు, పవన్, లోకేష్, బాలకృష్ణ, పురందేశ్వరిలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీలకు సినీ నటులతో పాటు క్రికెటర్లు, ఇతర రంగాల ప్రముఖులు స్టార్ క్యాంపైనర్లుగా ఉన్నారు. కూటమి పార్టీలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరో వారం రోజులు ఎవరి ఉన్న నేపథ్యంలో మరికొందరు రంగంలోకి దిగనున్నారు. అయితే కూటమితో పోలిస్తే వైసీపీకి మద్దతుగా ప్రచారానికి వచ్చేందుకు ఎవరు మొగ్గు చూపడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే మాత్రం వైసిపి నుంచి వింత సమాధానం ఎదురవుతోంది. తమకు ఏ స్టార్ క్యాంపైనర్లు అవసరం లేదని వైసీపీ శ్రేణులు గర్వంగా చెబుతుండడం విశేషం.
గత ఎన్నికల్లో వైయస్ కుటుంబ సభ్యులతో పాటు సినీ గ్లామర్ వైసీపీకి అధికంగా ఉండేది.మోహన్ బాబు లాంటి వారు అయితే నాటి టిడిపి ప్రభుత్వం పై ఎలా విరుచుకుపడ్డారో అందరికీ తెలిసిందే.పోసాని కృష్ణ మురళి,అలీ వంటి వారితో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం పరోక్షంగా సాయం చేశారు.తమ అభిమానులకు సైతం వైసీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమ వైసిపికి వ్యతిరేకంగా మారిపోయిందన్న ప్రచారం ఉంది. అయినా సరే పోసాని, అలీ వంటి వారు ఇప్పటికీ అనుకూలంగా ఉన్నారు. వారితో సైతం ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. కానీ ఎందుకో వైసిపి హై కమాండ్ వ్యూహం పేరిట కట్టడి చేస్తోంది. అది మొదటికే మోసం చేస్తుంది అన్న టాక్ నడుస్తోంది. అయినా సరే జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తాను ఒక్కడిని చాలు అన్నట్టు ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అటు పార్టీ శ్రేణులు సైతం అదే ధీమాతో ఉన్నాయి. అయితే వారి ధీమా వికటిస్తుందన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.