AP Elections 2024: సిక్కోలులో టఫ్ ఫైట్.. గ్రౌండ్ రిపోర్ట్ ఇదే

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను.. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఇచ్చాపురం అసెంబ్లీ స్థానానికి టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాలం అశోక్ పేరును ఖరారు చేసింది.

Written By: Dharma, Updated On : April 10, 2024 11:20 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: పోరాటాల పురిటి గడ్డ సిక్కోలు. ఎన్నో ఉద్యమాలకు వేదికగా నిలిచింది ఈ జిల్లా. రాజకీయ యవనికపై సైతం కీలక భూమిక పోషించింది. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, అవశేష ఏపీలోనైనా శ్రీకాకుళం జిల్లాది ప్రత్యేక స్థానం. అధికారంలోకి వచ్చేది ఏ ప్రభుత్వం అయినా.. ఈ జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాల్సిందే. ఎంతోమంది హేమహేమీలు ఈ జిల్లా నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. సర్దార్ గౌతు లచ్చన్న, బొడ్డేపల్లి రాజగోపాల్ రావు, మజ్జి తులసీదాసు, తంగి శ్యామలరావు.. ఇలా కాకలు తీరిన యోధులు ఉమ్మడి రాష్ట్రంలో నాయకులుగా చలామణి అయ్యారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాం, కింజరాపు ఎర్రంనాయుడు వంటి నేతలు పుట్టుకొచ్చారు. యువజన కాంగ్రెస్ నుంచి ఎదిగిన ధర్మాన ప్రసాదరావు రాష్ట్రంలోనే సీనియర్ నాయకుడిగా వ్యవహరించారు. అటువంటి సిక్కులు లో ఈసారి ఎన్నికలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను.. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఇచ్చాపురం అసెంబ్లీ స్థానానికి టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాలం అశోక్ పేరును ఖరారు చేసింది. వైసీపీ తరఫున జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ విజయ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో అశోక్ పై పోటీ చేసిన పిరియా సాయిరాజ్ భార్యే విజయ. ఈసారి ఎలాగైనా అశోక్ ని ఓడించాలని వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత, క్షేత్రస్థాయి బలంతో హ్యాట్రిక్ కొట్టాలని అశోక్ భావిస్తున్నారు. దీంతో ఇక్కడ హోరాహోరీ ఫైట్ నడుస్తోంది.

పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సిదిరి అప్పలరాజు రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈయన మంత్రి కూడా. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గౌతు శిరీష.. మరోసారి బరిలో నిలిచారు. ఇక్కడ కూడా హోరాహోరీ ఫైట్ ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. మంత్రిపై వ్యతిరేకత, వైసీపీలో అసంతృప్తులు వంటి కారణాలతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు టిడిపి అభ్యర్థి గౌతు శిరీష సైతం నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో విభేదాలు లేకపోవడం ఆమెకు కలిసి వచ్చే అంశం. అయితే సిట్టింగ్ మంత్రిగా ఉన్న అప్పలరాజు మరోసారి గెలుపు కోసం.. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు.

టెక్కలిలో టిడిపి అభ్యర్థిగా కింజరాపు అచ్చెనాయుడు మరోసారి బరిలో దిగారు. ఈసారి వైసిపి దూకుడుగా వ్యవహరించే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పోటీలో పెట్టింది. అయితే శ్రీనివాస్ దూకుడు వైఖరి సొంత పార్టీ శ్రేణుల్ని దూరం చేస్తోంది. పైగా ఇక్కడ టిడిపి పట్టు బిగిస్తోంది. కీలక మండలంలో ఉన్న నందిగాంలో మెజారిటీపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇక్కడ టిడిపి అభ్యర్థి అచ్చన్న విజయ బావుటా ఎగురవేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పాతపట్నం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టిడిపికి చెందిన మామిడి గోవిందరావు పేరును ఖరారు చేశారు. అయితే ఇక్కడే విభిన్న పరిస్థితి నెలకొంది. రెడ్డి శాంతి నాయకత్వాన్ని విభేదిస్తున్న ఐదు మండలాల మెజారిటీ క్యాడర్ పక్క చూపులు చూస్తోంది. మరోవైపు మామిడి గోవిందరావు అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి వ్యతిరేకిస్తున్నారు. మెజారిటీ టిడిపి క్యాడర్ కలమట వెంట ఉంది. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని తెలుస్తోంది. దీంతో ఇక్కడ అస్తవ్యస్త వాతావరణం నెలకొంది. రెండు పార్టీలకు అసమ్మతి బెడద తప్పడం లేదు.

నరసన్నపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ ఖరారయ్యారు. టిడిపి అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి పేరును ప్రకటించారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరే పోటీ చేశారు. అయితే ఇక్కడధర్మాన కృష్ణ దాస్ గెలుపు ఈజీ అని అంతా భావించారు. కానీ ఇక్కడ టిడిపి అభ్యర్థి రమణమూర్తి సౌమ్యుడు, ఆపై ధర్మాన కృష్ణ దాస్ పై సొంత పార్టీ శ్రేణులు తిరగబడ్డాయి. టిడిపిలో చేరికలు పెరిగాయి. దీంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారాయి. దీంతో గట్టి ఫైట్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణ దాస్ పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టిడిపి నుంచి గొండు శంకర్ పేరు ఖరారు అయింది. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వ్యతిరేకిస్తున్నారు. మెజారిటీ క్యాడర్ గుండ లక్ష్మీదేవి వెంట ఉంది. దీంతో శంకర్ పేరును తప్పించి లక్ష్మీదేవి పేరును ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ధర్మాన ప్రసాదరావు గెలుపొందారు. కానీ ఈసారి టిడిపి శ్రేణులు ఏకమైతే ఆయనకు ఓటమి తప్పదు అన్న సంకేతాలు వస్తున్నాయి.

ఆమదాలవలస నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి పోటీకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా టిడిపి అభ్యర్థి కూన రవికుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ తమ్మినేని పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. సువ్వారి గాంధీ అనే నేత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఇక్కడ తమ్మినేని ఎదురీదుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టిడిపి ఇక్కడ గెలుపొందే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.

ఎచ్చెర్ల వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా బిజెపి నేత నడుకుదిటి ఈశ్వరరావు బరిలో దిగారు. ఇక్కడ టిడిపి బిజెపి జనసేన శ్రేణులు సమన్వయంతో పని చేస్తున్నాయి. వైసీపీలో అసమ్మతి ఉంది. ఒక వర్గం కిరణ్ ను వ్యతిరేకిస్తోంది. అయితే బిజెపి అభ్యర్థి కావడంతో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాటన్నింటినీ అధిగమించి విజయం సాధిస్తామని కూటమి అభ్యర్థి ధీమాతో ఉన్నారు. మొత్తానికైతే సిక్కోలులో గట్టి ఫైట్ నడుస్తోంది.