AP Elections 2024: ఏపీలో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదయింది. పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటించింది. ఈవీఎంలలో పోలైన ఓట్లను 17ఏ రిజిస్టర్ తో పోల్చి చూసిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చింది. 81.76% పోలింగ్ నమోదయినట్లు ఈసీ తేల్చింది. ఈవీఎంలలో పోలైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లను కలిపి ఈ గణాంకాలను తేల్చారు. వాస్తవానికి తుది పోలింగ్ శాతం 80.66 శాతం కాగా… పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.1% కలుపుకొని.. తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించారు.
అయితే పెరిగిన పోలింగ్ శాతంతో.. తమకు అనుకూలమంటే.. తమకు అనుకూలమని అధికార,విపక్షాలు అంచనా వేస్తున్నాయి. ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటింగ్ శాతం పెరిగితే విపక్షాలకు అనుకూలం. అయితే 2019 ఎన్నికల్లో సైతం ఓటింగ్ గణనీయంగా పెరిగింది. అప్పుడు వైసీపీ సూపర్ విక్టరీ సాధించింది. ఇప్పుడు కూడా ఓటింగ్ శాతం పెరగడంతో విపక్షాలకు ఛాన్స్ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏపీలో పోలింగ్ శాతం పెరగడం మాత్రం శుభపరిణామం. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు కసితో ఓటు వేశారని విపక్షాలు చెబుతున్నాయి. తాము ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఇష్టపడ్డ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేశారని అధికారపక్షం ధీమాతో ఉంది.
అయితే ఈసారి చిత్తూరు జిల్లాలో అత్యధిక ఓటింగ్ నమోదు కావడం విశేషం. మొత్తం 87.09 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. చంద్రబాబు సొంత జిల్లా కావడం విశేషం. పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు అన్నంత పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. మధ్యలో నల్లారి కుటుంబం సైతం చేరింది. దీంతో ఇక్కడ పరిస్థితి ఒక్కసారిగా హీటెక్కింది. ముఖ్యంగా ఇక్కడ తమిళ ఓటర్లు కీలకం. ఓటు వేయడానికి తమిళ ఓటర్లు పోటెత్తారు. మరోవైపు విశాఖ జిల్లాలో తక్కువ శాతం పోలింగ్ నమోదయింది. 68.63 శాతం మాత్రమే పోలింగ్ జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం.. తిరుపతి నియోజకవర్గంలో అత్యంత 63.32% ఓటింగ్ నమోదయింది. అయితే ప్రాంతాలు, నియోజకవర్గాల వారీగా వేరువేరుగా ఓటింగ్ శాతం నమోదైనా.. రాష్ట్రవ్యాప్త గణాంకాల్లో మాత్రం రికార్డ్ స్థాయిలో నమోదయింది. దీంతో అధికారపక్షంలో ఒక రకమైన భయం ఉంది. విపక్ష కూటమిలో ధీమా కనబడుతోంది. మరి ఏం జరుగుతుందో అన్నది జూన్ 4న తెలుస్తుంది.