Ramoji Rao Vs Jagan: ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రలోభాలకు తెర లేచింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఆంధ్రాలో మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈసారి తారాస్థాయికి చేరింది. ఈ ఎన్నికలు అక్షరాల సాక్షిగా జగన్మోహన్ రెడ్డికి, రామోజీరావుకు మధ్య జరుగుతున్నట్టుగా పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజులుగా ఈనాడు తన విలువలను, వలువలను వదిలేసి జగన్ వ్యతిరేక వార్తలు రాస్తోంది. రాయడం మాత్రమే కాదు తాను ఇన్నాళ్లుగా కాపాడుకున్న “మాస్టర్ హెడ్ (వార్తాపత్రికలకు తలకాయ లాంటిది) ను కూడా పక్కకు జరుపుతోంది. ఒంటినిండా పసుపు రంగు పూసుకొని.. బజారులో పోతురాజు మాదిరి చర్నాకోల్ తో కొట్టుకుంటున్నది. జగన్ డౌన్ డౌన్ అంటూ రంకెలు వేస్తోంది.. హెడ్ లైన్ నుంచి ఫోటో రైట్ అప్ దాకా.. జగన్ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోంది. ఏది నిజం.. ఏది అబద్దం అని పక్కన పెడితే.. ఒకప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు.. కాంగ్రెస్ పార్టీ మీద ఎంతటి విష ప్రచారం చేసిందో.. అంతకుమించి జగన్ మీద విష ప్రచారం చేస్తోంది. విషాన్ని, విద్వేషాన్ని ఏపీ ప్రజల మెదళ్లల్లో నింపుతోంది.
ఆదివారం ఈనాడు సంచికలో ” జగన్ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలి, దీనికోసం ఏపీ ప్రజలు కూటమికి ఓటు వేయాలని” మొదటి పేజీలో పిలుపునిచ్చింది. 8, 9 పేజీలలో ఏకంగా సెంటర్ స్ప్రెడ్ పరిచేసింది. జగన్ వ్యతిరేక కథనాలను మరింత ఘాటుగా రాసింది. వాస్తవానికి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తొలి రోజుల్లో కూడా ఈనాడు ఈ స్థాయిలో బరితెగించలేదు. ఇంత నీతి మాలిన తీరుగా వ్యవహరించలేదు. ఈనాడులో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారు కూడా.. ఈ స్థాయిలో తాము ఎప్పుడూ వ్యవహరించలేదని చెబుతున్నారంటే రామోజీరావు కోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడిదాకా ఎందుకు ఈనాడు ఒకప్పుడు తనకు సహకరించిన తీరును బహిరంగంగానే చెప్పిన ఎన్టీ రామారావు.. ఆ తర్వాత రామోజీరావు రెండు నాలుకల ధోరణిని బహిరంగంగానే ఎండగట్టారు. అప్పట్లో ఎన్టీ రామారావుపై ఈనాడు శ్రీధర్ ఎలాంటి కార్టూన్స్ వేశాడో ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి.
వాస్తవానికి ఈనాడు రాసిందే నిజం అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. గతంలో ఆ పత్రిక చదివి చాలామంది ప్రభావితులయ్యేవారు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది కాబట్టి.. ప్రజలకు ఏది నిజం, ఏది అబద్దం అనేది తెలిసిపోయింది. ఎవరి రాతలు ఎలా ఉన్నాయి, ఎందుకోసం ఉన్నాయి, ఎవరి ప్రయోజనాల కోసం వాటిని రాస్తున్నారనే విషయం పాఠకులకు అవగతం అవుతూనే ఉంది. అయినప్పటికీ బాధ్యతాయుతమైన మీడియాగా ఉండాల్సిన ఈనాడు కసిగా వార్తలు రాస్తోంది. జగన్ ను జనం తని తరిమేయాలంటూ పిలుపునిస్తోంది. ఒకవేళ ఈనాడు రాసినవి మొత్తం నిజమే అయితే.. గత ఎన్నికల్లో జగన్ ఎలా విజయం సాధిస్తాడు?, చంద్రబాబు 23 కే ఎందుకు పరిమితమవుతాడు?, అంతకుముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఎందుకు అధికారంలోకి వస్తాడు? ఇదే లాజిక్ ను ఈనాడు మర్చిపోయింది. జగన్ మీద టన్నులకొద్దీ విష ప్రచారం చేసింది.
వాస్తవానికి తన మానస పుత్రిక అయిన మార్గదర్శి మీద జగన్ కత్తి కట్టాడు. ఏకంగా తననే అరెస్టు చేయించాలని డిసైడ్ అయ్యాడనే మంట రామోజీరావులో రగులుతోంది. అయితే తన మార్గదర్శిని శుద్ధపూస అని నిరూపించుకుంటే ఇంత ప్రయాస పడాల్సిన అవసరం రామోజీరాకు లేదు. ఆ విషయాన్ని పక్కన పెట్టి రాతల్లో చూపిస్తున్నాడు. ఇప్పటిదాకా న్యూట్రల్ ముసుగు వేసుకొని పాఠకులను తన మైకంలో ముంచాడు. ఇప్పుడు దానిని అతడే బ్రేక్ చేస్తున్నాడు. స్థూలంగా చెప్పాలంటే పత్రిక భవితవ్యాన్ని నటి బజార్లో తాకట్టు పెడుతున్నాడు. ఈనాడు రామోజీరావుది కావచ్చు, కానీ దాని మీద వేలాదిమంది ఉద్యోగులు ఆధారపడి బతుకుతున్నారు.
ఈనాడు మాత్రమే రాస్తోందా?, సాక్షి సంగతేంటి? అనే ప్రశ్న రావచ్చు. కానీ ఇక్కడ సాక్షి న్యూట్రల్ ముసుగు వేసుకోలేదు. అది ఉదయం లేస్తే చేసేది జగన్ భజన మాత్రమే. అచ్చం కేసీఆర్ నమస్తే తెలంగాణ లాగా.. ఈనాడు న్యూట్రల్ లాగా ఫోజు కొట్టింది కాబట్టి.. తెలుగు ప్రజలు ఆ పత్రికకు మొదటి స్థానం ఇచ్చారు. ఆ పత్రిక ఎదుగుదలలో తమ వంతు కృషి చేశారు. ఇలాంటి సమయంలో ఈనాడు ఎంతో కొంత తన విలువలను ప్రదర్శించాలి. కానీ, దానిని రామోజీరావు ఎప్పుడో పక్కన పెట్టాడు. విలువల్ని, వలువలను వదిలేసి బాబుకు భజన చేస్తున్నాడు.. వాస్తవానికి బాబు భజనలో ఆంధ్రజ్యోతి తర్వాతే ఎవరైనా. కానీ, ఈ ఎన్నికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి ని ఎప్పుడో మించిపోయింది.. ప్రస్తుత ఎన్నికల్లో జగన్ ఓడొచ్చు, లేదా గెలవచ్చు.. కానీ జగన్, రామోజీరావు మధ్య యుద్ధం అలానే కొనసాగుతుంది. ఒకవేళ జగన్ పడిపోతే పచ్చ మంద ఆయనను దారుణంగా వేటాడుతుంది. గతంలో కంటే మరింత రెట్టింపు వేగంతో ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ జగన్ గెలిస్తే అంతకుమించి అనేలాగా ఎల్లో గ్యాంగ్ భరతం పడతాడు. వాస్తవానికి జగన్ ఎవరి మాటా వినడు అంటారు. కానీ, రామోజీరావు అంతకుమించి.. చూడాలి జూన్ 4న ఏం జరుగుతుందో..