AP Elections 2024: మే సమీపిస్తోంది. కేవలం ఐదు రోజులే ఉంది. ఇప్పుడు అందరి దృష్టి పింఛన్ల పైనే పడింది. ఏప్రిల్ నెల కు సంబంధించి పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే వాలంటీర్లను తొలగించడం ద్వారానే ఆలస్యం జరిగిందని వైసిపి ఆరోపించడం ప్రారంభించింది. దీనికి టిడిపి కారణమని ప్రచారం చేసింది. అయితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడం వల్లే ఈ తరహా ప్రచారాన్ని దిగిందని టిడిపి ఎదురు దాడి చేసింది. అందుకే వారం రోజులు ముందు నుంచే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగంతో ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయాలని అన్ని పార్టీల నాయకులు లేఖలు రాయడం ప్రారంభించారు. మే 1న ఇంటింటా పింఛన్ల పంపిణీ ప్రారంభం కాకపోతే అది అధికార పార్టీ కుట్రగానే పవన్ అభివర్ణించారు.
ముఖ్యంగా పింఛన్ల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. రకరకాల కుంటి సాకులు చూపి మే ఒకటిన పింఛన్లు ఇవ్వకుంటే అధికార పార్టీ తమపై తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యం అని ముందుగానే ప్రకటించింది. కానీ ఈ ఆలస్య ప్రక్రియలో చాలామంది వృద్ధులు చనిపోయారు. అక్కడే అధికార పార్టీ రాజకీయం మొదలుపెట్టింది. గత ఐదు సంవత్సరాలుగా ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు పింఛన్లు అందించారని.. అటువంటి వాలంటీర్లను విధుల నుంచి తప్పించడానికి ప్రతిపక్షాలే కారణమని వైసిపి చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అందుకే ఇప్పుడు విపక్షాలు ముందుగానే అలర్ట్ అయ్యాయి. పింఛన్ల పంపిణీ ఆలస్యమైతే అందులో రాజకీయ కుట్ర ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిసైడ్ అయ్యాయి.
ఏప్రిల్ నెల కు సంబంధించి పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడంతో.. చాలామంది వృద్ధులు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అటువంటి వారి మృతదేహాలతో వైసిపి హడావిడి చేసింది. గత ఐదేళ్లలో సవ్యంగా సాగుతున్న ప్రక్రియకు టిడిపి అడ్డుపడిందని అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. అందుకే అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా విపక్షాలు జాగ్రత్త పడ్డాయి. వారం రోజుల ముందు నుంచే ఎలక్షన్ కమిషన్ తో పాటు విపక్ష నేతలు లేఖలు రాయడం ప్రారంభించారు. పింఛన్ల పంపిణీలో లోటుపాట్లు రాకుండా చూడాలని కోరారు. ఒకటో తేదీన ఇంటికి వెళ్లి పంపిణీ చేయాలని కోరుతున్నారు. మొత్తానికి అయితే మే మొదటి వారంతో పాటు ఎన్నికల ప్రచారంలో మరోసారి పింఛన్ల రగడ జరగనుంది.