AP Elections 2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో లోకల్ నుంచి నేషనల్ వరకు చాలా వరకు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. వాటి ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అయితే పార్టీలే పెయిడ్ సర్వేలు చేయిస్తున్నాయని.. వాటికి ఏమాత్రం పారదర్శకత లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక సర్వే వైసిపి గెలుస్తుందని చెబుతుండగా.. మరో సర్వే టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చి చెబుతోంది. దీంతో సామాన్య జనాలు సైతం సర్వేలను పెద్దగా పట్టించుకోవడం లేదు.లైట్ తీసుకుంటున్నారు. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట ఒక సర్వే హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
ఏపీలో 175 నియోజకవర్గాలకు గాను.. 51% ఓటు షేర్ తో వైసీపీకి 124 సీట్లు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. కేవలం 45 శాతం ఓటు శారితో 51 సీట్లకే టిడిపి కూటమి పరిమితం కానుందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. అయితే ఇది నిజంగా ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే అవునా? కాదా? అన్నది తెలియడం లేదు. కానీ ఏపీలో మాత్రం తెగ సర్క్యులేట్ అవుతోంది. ఈ సర్వే తో వైసీపీ శ్రేణులు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఏపీలో వైసిపి గ్రాఫ్ పెరిగిందని చెప్పుకొస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం హోరాహోరీ ఫైట్ తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ సర్వేలు మాత్రం మిశ్రమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు రాష్ట్ర నిఘా సంస్థలు, ఇతర ఏజెన్సీలు చాలా వరకు వైసిపికి అనుకూల ఫలితాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియాలి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉంది. టిడిపి ఎన్డిఏ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటువంటి సమయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో తన సర్వే ఫలితాలను ఎందుకు ప్రకటిస్తుందని.. వైసీపీకి అనుకూలంగా ఎందుకు ఫలితాలు ఇస్తుందని.. అలా చేస్తే కూటమిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని.. ఇదంతా వైసిపి సృష్టిస్తున్న ఫేక్ అని టిడిపి కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. సర్వేల ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికివైసిపి ప్రయత్నిస్తోందని.. ప్రజల మూడ్ స్పష్టంగా ఉందని.. అధికారంలోకి వచ్చేది కూటమియేనని మూడు పార్టీలు తేల్చి చెబుతున్నాయి.