Killi Krupa Rani: ఏపీ సీఎం జగన్ పై కేంద్ర మాజీ మంత్రి కృపారాణి ఆగ్రహంగా ఉన్నారు. నాడు తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్ని విధాలా కృపారాణిని ప్రోత్సహిస్తే.. కుమారుడు జగన్ వైసీపీలోకి రప్పించి దారుణంగా వంచించారని ఆమె ఆగ్రహంగా ఉన్నారు. అందుకే జగన్ సోదరి షర్మిల తో కృపారాణి చేతులు కలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీని దారుణంగా దెబ్బతీయాలని భావిస్తున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు టెక్కలి అసెంబ్లీ సీటులో వైసిపి గెలవకుండా గట్టి స్కెచ్ వేశారు. వైసిపి ఓట్లను భారీగా చీల్చి.. తన ద్వారా తీవ్ర నష్టం కలిగించాలని కృపారాణి చూస్తున్నారు.
2004లో కాంగ్రెస్ పార్టీలో కృపారాణి చేరారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో రెండోసారి పోటీ చేసి సీనియర్ నాయకుడు ఎర్రం నాయుడు ను ఓడించారు. జైంట్ కిల్లర్ గా నిలిచి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014లో వైసీపీలోకి కాంగ్రెస్ పార్టీ నేతలు చేరినా.. కృపారాణి మాత్రం అదే పార్టీలో కొనసాగారు. కానీ 2019లో సరైన గౌరవం ఇస్తామని చెప్పి ఆమెను వైసీపీలోకి తీసుకెళ్లారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా ఎటువంటి గుర్తింపు లేకుండా పోయింది ఆమెకు. ఆమె కంటే జూనియర్లు అయిన దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ లకు జగన్ టికెట్లు కట్టబెట్టారు. కానీ కృపారాణి విషయానికి వచ్చేసరికి మాత్రం మొండి చేయి చూపారు.. అందుకే ఆమె వైసీపీకి గట్టి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు.
టెక్కలి నియోజకవర్గం ఏపీలోనే హాట్ టాపిక్. 1994 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గ నుంచి నందమూరి తారకరామారావు పోటీ చేశారు. తాజాగా గత రెండు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు గెలుపు పొందుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. అచ్చన్న పై పోటీగా దువ్వాడ శ్రీనివాసును జగన్ బరిలో దించారు. ఇక్కడ మరో ఆశావహుడుగా ఉన్న పేరాడ తిలక్ ను శ్రీకాకుళం లోక్సభ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. కానీ కృపారాణిని మాత్రం పట్టించుకోలేదు. అయితే ఈ ముగ్గురు నేతలు కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారే. అందుకే కృపారాణి సరైన వ్యూహం పన్నారు. టెక్కలి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో కృపారాణి పట్టున్న నేత. ఆపై సొంత సామాజిక వర్గం లో మంచి పేరు ఉంది. దీంతో ఇక్కడ కాలింగ ఓట్లను చీల్చి వైసిపి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసుని ఓడించాలని భావిస్తున్నారు. తద్వారా జగన్ కు గట్టి బుద్ధి చెప్పాలని..తానేంటో నిరూపించుకోవాలని చూస్తున్నారు. మరి కృపారాణి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.