AP Election Surveys: ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సర్వేలు హల్చల్ చేస్తాయి. కానీ ఏపీలో మాత్రం ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం ఇది అంటూ సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అయితే మెజారిటీ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటిస్తుండడం మాత్రం గమనార్హం. అయితే ఇటీవల వస్తున్న సర్వేల్లో మాత్రం కొత్తదనం కనిపిస్తోంది. ఎన్డీఏకు అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో ప్రజల్లో కూడా ఒక రకమైన గందరగోళం నెలకొంటుంది. చివరకు సర్వేలను ప్రజలు నమ్మలేని పరిస్థితి వచ్చింది. పెయిడ్ సర్వేలు అంటూ అనుమానం కలిగేలా వాటి ఫలితాలు ఉన్నాయి. అసలు గతంలో ఎప్పుడూ వినని పేర్లతో సర్వే సంస్థలు హడావిడి చేస్తుండడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి చాలా సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ వారి అంచనా తప్పయింది. మరి కొన్ని సర్వే సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చాయి. అయితే వైసీపీ కానీ విని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ దీనిని ఒక సర్వే సంస్థ కూడా అంచనా వేయలేకపోయింది. అయితే ఏపీలో ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచే సర్వే సంస్థలు ఎంటర్ అయ్యాయి. సర్వే ఫలితాలను వెల్లడించాయి. మెజారిటీ సర్వేలు అధికార పార్టీగా ఉన్న వైసీపీకి అనుకూలంగా ఇవ్వడం గమనార్హం. అయితే పోల్ మేనేజ్మెంట్లో భాగంగా, ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగా ప్రజలను వైసీపీ వైపు టర్న్ చేసేందుకు వైసిపి పెయిడ్ సర్వేలు చేయిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సర్వేల కోసమే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి అన్నది విపక్షాల ఆరోపణ.
అయితే ఈ సర్వేలతో లగడపాటి రాజగోపాల్ వంటి వారు చేతులు కాల్చుకున్నారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో మహాకూటమి, 2019లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని లగడపాటి చెప్పుకొచ్చారు. ఈ రెండు సర్వేలు వరసగా ఫెయిల్ కావడంతో ఢిల్లీ వెళ్లి కూర్చున్నారు. ప్రస్తుతం ఆయన తమ్ముడు ఈ సర్వేల బాధ్యతను తీసుకున్నారు. ఆయన సైతం వైసీపీ గెలుస్తుందని సోదరుడికి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తమకు సర్వే ఫలితాలు అనుకూలంగా వస్తే సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతికూల ఫలితాలు వస్తే ప్రత్యర్థుల ప్రయత్నాలుగా చెప్పుకుంటున్నారు. అయితే తెలుగునాట ఈ సర్వేలను ప్రజలు పట్టించుకోవడం మానేశారు. మొన్నటికి మొన్న తెలంగాణలో బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని మెజారిటీ సర్వేలు తేల్చాయి. కానీ అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సర్వే అంచనాలను తారుమారు చేసింది. అయితే ఏపీలో 10 సర్వేల్లో 8 వరకు వైసీపీకే ఏకపక్ష విజయమని తేల్చి చెబుతున్నాయి. సహజంగానే ఇది వైసీపీ నేతల్లో జోష్ నింపగా.. విపక్షాల్లో మాత్రం నిరాశ నింపుతోంది.