Deputy Speaker Kolagatla : విజయనగరం రాజులను మట్టి కరిపించిన చరిత్ర కోలగట్ల వీరభద్రస్వామిది. విద్య, వైద్యం కోసం తమ యావదాస్థిని ప్రజల కోసం విజయనగరం రాజులు త్యజించారు. అటువంటి రాజులపైనే రెండుసార్లు గెలిచారు కోలగట్ల. తొలిసారి అశోక్ గజపతిరాజుపై గెలిచి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఏపీలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు కోలగట్ల చేతిలో ఓడిపోయారు. తూర్పుకాపు జనాభా ఉండే ఈ నియోజకవర్గంలో వైశ్య సామాజికవర్గానికి చెందిన నేతగా కోలగట్ల రంగంలోకి దిగారు. ఆయన రాజకీయం వెనుక రాజుల వ్యూహం వెనుకబడిపోయింది. అటువంటి కోలగట్ల మరోసారి వార్తల్లో నిలిచారు.
ప్రస్తుతం కోలగట్ల ఏపీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తారు. మంగళవారం నేషనల్ స్విమ్మింగ్ ఫుల్ డే సందర్భంగా విజయనగరంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈత పోటీలు నిర్వహించారు. మంత్రి బొత్స, స్పీకర్ తమ్మినేని సీతారాం పోటీలను ప్రారంభించారు. అయితే ఆరున్నర పదుల వయసులో ఉన్న కోలగట్ల నేను సైతం అంటూ ఈత పోటీలకు సిద్ధమయ్యారు. ప్రారంభోత్సవం కదా? ఏదో సరదాగా దిగారని అక్కడున్న వారంతా భావించారు. కానీ కాసేపటికి కోలగట్ల తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
స్విమ్మింగ్ ఫుల్ లో దిగిన కోలగట్ల జలాసనం వేశారు. ఏకంగా నీటిపై గంటపాటు తేలియాడుతూ ఉండిపోయారు. అయితే అక్కడ ఉన్నవారిలో ఒక్కటే ఆందోళన. కోలగట్ల స్థూలకాయుడు. అటువంటి వ్యక్తి తేలియాడుతూ కనిపించడం నమ్మబుద్ధి కాలేదు. కానీ గంట తరువాత తేలియాడుతూ ఉన్న మనిషి తేరుకొని బయటకు రావడంతో అక్కడున్న వారు ఊపిరిపీల్చుకున్నారు. యువతరానికి స్విమ్మింగ్, యోగా ప్రాధాన్యత తెలియజెప్పాలన్న ఉద్దేశ్యంతోనే తాను జలాసనం వేసినట్టు కోలగట్ల చెప్పారు. యువత స్మార్ట్ ఫోన్లు విడిచిపెట్టి ఆరోగ్యాన్నిచ్చే వాటిపై ఫోకస్ పెంచాలని పిలుపునిచ్చారు.