BJP with TDP : ఏపీ విషయంలో బీజేపీ అంతరంగం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆ పార్టీతో కలిసి నడవాలని అన్ని పార్టీలు అనుకుంటున్నాయి. కానీ బీజేపీ ఎవరితో కలిసి నడుస్తుందో స్పష్టతనివ్వడం లేదు. రాష్ట్రాల్లో ప్రయోజనాలు కంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలోపేతంపైనే బీజేపీ ఫోకస్ పెట్టింది. అందు కోసం ప్రాంతీయ పార్టీల వైపు చూస్తోంది. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం ఏపీలో అన్ని పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయి. దీంతో ఏ పార్టీ ఎన్డీఏలో చేరుతుందానేదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. బీజేపీ ఏ పార్టీని తన దరికి చేర్చుకుంటుందా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కర్నాటక ఎన్నికల తరువాత రాజకీయ సమీకరణల్లో మార్పులు వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలో కలిసి పనిచేసేందుకు 18 పార్టీలు ఏకమయ్యాయి. అదే సమయంలో బీజేపీ వెనుక చూస్తే చిన్నాచితకా పార్టీలే తప్ప.. పెద్ద పార్టీలు ఏవీ కనిపించలేదు. గత ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్కు దాటి సొంతంగానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఎన్డీఏను మాత్రం కొనసాగించింది. మిత్రపక్షాలకు మంత్రి పదవులు కేటాయించింది. అయితే ఇప్పుడు ఉన్న పార్టీలు చాలవన్నట్టు నమ్మదగిన పార్టీల కోసం బీజేపీ అన్వేషిస్తోంది.
అయితే ఏపీ విషయానికి వచ్చేసరికి ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. ఇక్కడ అధికార పక్షం వైసీపీతో పాటు విపక్షాలు టీడీపీ, జనసేనలు సైతం స్నేహ హస్తం అందిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా టీడీపీ చేయని ప్రయత్నం చేయలేదు. అటు జనసేన సైతం టీడీపీ, బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కూటమి కట్టాలని చంద్రబాబు, పవన్ ఆలోచనగా తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షాలను కలిసి చర్చలు జరిపారు. దీంతో పొత్తు ఖాయమన్న సంకేతాలు వచ్చాయి. అయితే టీడీపీతో పొత్తు కుదిరితే తమకు ఇబ్బందులు వస్తాయని భావిస్తున్న వైసీపీ సైతం కేంద్ర కేబినెట్ లో చేరేందుకు ముందుకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి.
ఈ తరుణంలో ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నారాయణస్వామి బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే వెళతాయని ప్రకటించారు. దీంతో మరోసారి పొత్తులపై దుమారం రేగింది. ఇప్పటికే ఏపీలో వైసీపీ స్ట్రాంగ్ గా ఉందని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి 25కు 25 ఎంపీ స్థానాలు వస్తాయని ఓ జాతీయ మీడియా సర్వే వెల్లడించింది. దానిని చూపించి బీజేపీని వైసీపీ తమవైపు తిప్పుకుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి నారాయణస్వామి ప్రకటనతో సర్వే ఫేక్ గా నిర్ధారించినట్టయ్యిందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.