Deputy CM Pawan Kalyan : సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం. నెల్లూరు జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా డోంకూరు వరకు దాదాపు 1000 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఏపీకి వరం. అపారమైన మత్స్య సంపద, ఆపై పర్యాటక సోయగాలు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టేవే. కానీ ఈ విషయంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూనే ఉన్నాయి. తీరం వెంబడి పరిశ్రమలతో స్థానికులకు లాభం లేకపోగా.. ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలతో విలువైన మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోంది. స్థానికంగా మత్స్యకారులకు వేట గిట్టుబాటు కాక.. ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లాల్సి వస్తోంది. అందుకే మత్స్యకారులపై దృష్టి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తీరంలో పరిశ్రమల వ్యర్ధాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. వ్యర్ధాలను విడిచి పెడుతున్న పరిశ్రమలను తనిఖీ చేయాలని పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు.
* ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృత్యువాత
ఏపీ తీరంలో అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఉన్నాయి. తీరానికి వచ్చి గుడ్లు పెట్టిన తర్వాత అవి తిరిగి సముద్రంలోకి చేరుకుంటాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. వెయ్యి కిలోమీటర్ల ఏపీ తీర ప్రాంతంలో.. ఎక్కడ చూసినా ఆలివ్ రెడ్లే తాబేళ్ల మృతదేహాలు కనిపిస్తున్నాయి. కాకినాడ తీరంలో తాజాగా భారీ ఎత్తున తాబేళ్ల మృత్యువాత పడ్డాయి. ఈ విషయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై పవన్ సీరియస్ అయ్యారు. తక్షణం వాటిపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. పరిశ్రమల వ్యర్ధాలపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అందించాలని ఆదేశించారు.
* కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు
రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఆపై ఐదు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్నారు. అందులో ప్రధానమైనది పర్యావరణ శాఖ. మరోవైపు అటవీ శాఖను సైతం నిర్వర్తిస్తున్నారు పవన్. ఈ క్రమంలో అటవీ సంపద స్మగ్లింగ్ గురికావడాన్ని కూడా గుర్తించారు. తిరుపతి శేషాచలంలో అటవీ సంపద తరలుతుండడాన్ని, ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పుడిప్పుడే స్మగ్లింగ్ నియంత్రణలోకి వస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు పర్యావరణంపై ఫుల్ ఫోకస్ చేశారు. ప్రధానంగా తీర ప్రాంతంలో మృత్యువాత పడుతున్న మత్స్య సంపద విషయంలో.. సీరియస్ యాక్షన్ లోకి దిగనున్నారు. అందులో భాగంగానే తీరం వెంబడి ఉన్న పరిశ్రమల వ్యర్ధాలపై అధ్యయనం చేయనున్నారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు. వారిచ్చే నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించనుంది ఏపీ సర్కార్.