Pawan Kalyan district tour: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP deputy CM Pawan Kalyan )జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు పాలనపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్.. కొద్దిరోజులుగా క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉన్నారు. అయితే మరోసారి జిల్లాల పర్యటనకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. చివరిసారిగా విశాఖ మన్యం ప్రాంతంలో పర్యటించారు. కొండ శిఖర గ్రామాలకు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గిరిజనుల పిలుపుమేరకు వారి గ్రామాలను సైతం సందర్శించారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురయ్యారు. అప్పట్లో గిరిజన ప్రాంతాల్లో పర్యటన ముగించుకున్న తరువాత సింగపూర్ వెళ్లారు పవన్ కళ్యాణ్. అయితే అదే చివరి పర్యటన. ఆ తరువాత ఆయన పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. మరోసారి పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు సంబంధించి డిప్యూటీ సీఎం కార్యాలయం షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
బాధిత విద్యార్థుల కోసం..
తొలుత పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం( parvatipuram manyam ) జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ కురుపాం ప్రభుత్వ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరాలతో పాటు పచ్చకామర్లతో బాధపడుతున్నారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వారు ఎలా చనిపోతున్నారు అన్నది వైద్య ఆరోగ్యశాఖకు అంతుపట్టడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేరుగా తాను కురుపాం వెళ్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆది నుంచి గిరిజన ప్రాంతాల విషయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో ఉంటున్నారు. అందుకే ఇప్పుడు కురుపం వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు కానుంది.
సొంత నియోజకవర్గానికి..
మరోవైపు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో( Pithapuram ) పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే అక్కడ జనసేనలో విభేదాలు తలెత్తాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు టిడిపి శ్రేణులనుంచి కూడా నిరసన స్వరం వినిపిస్తోంది. ఈ క్రమంలో జనసేనలో సమన్వయ కమిటీ ఐదుగురు నేతలతో వేశారు పవన్ కళ్యాణ్. టిడిపి ఇన్చార్జ్ వర్మతో సైతం సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సొంత నియోజకవర్గాన్ని కొంత సమయం కేటాయించాలని పవన్ భావిస్తున్నారు. అభివృద్ధి పనులతో పాటు పలు రకాల సమస్యలపై దృష్టి పెట్టనున్నారు పవన్. పార్వతీపురం మన్యం పర్యటన ముగించుకున్న తర్వాత పవన్ పిఠాపురం వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.
బాలినేని కోరిక మేరకు..
మరోవైపు ప్రకాశం జిల్లాలో( Prakasam district) పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితంగా ఉండే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లా కు ఆహ్వానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా వ్యవహరించి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అటువంటి నేత జగన్మోహన్ రెడ్డిని విభేదించి పవన్ కళ్యాణ్ వెంట నడిచారు. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ప్రకాశం జిల్లాలో అనుకున్న ప్రాధాన్యం దక్కడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ను పిలిపించి భారీ స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని జనసేనలో చేర్పించాలని బాలినేని భావిస్తున్నారు. అందుకే పవన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే పవన్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధపడుతున్నారు అన్నమాట.