Jubilee Hills By-Election: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించాలని టిడిపి భావిస్తోంది. ఇందులో భాగంగానే పార్టీని పటిష్టం చేయడానికి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వరం లాగా మారాయి. మంగళవారం సాయంత్రం ఉండవల్లి ప్రాంతంలో తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు ఉండవల్లి వెళ్లిపోయారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానం.. పోటీ చేస్తే ఎవరిని రంగంలోకి దింపాలి.. ఈ అంశాల ఆధారంగానే చంద్రబాబుతో తెలంగాణ టిడిపి నేతల సమావేశం కొనసాగుతుందని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ తరఫునుంచి జూబ్లీహిల్స్ స్థానంలో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని పోటీలో ఉంచాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి సుహాసినిని పోటీలో దింపుతామని ఇప్పటికే చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలతో ఇటీవల చెప్పినట్టు తెలుస్తోంది.
సుహాసిని 2018లో జరిగిన ఎన్నికల్లో కూకట్పల్లి ప్రాంతం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. బిజెపి గనుక సహకరిస్తే సుహాసినిని కూటమి అభ్యర్థిగా పోటీలో దించుతారని తెలుస్తోంది. బిజెపి కూడా జూబ్లీహిల్స్ స్థానంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే దిశగా బిజెపి నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కొంతమంది సీనియర్ నాయకులతో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా టికెట్ ఎవరికీ ఇస్తే బాగుంటుందో నిర్ణయించనున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు. మరోవైపు ఉండవల్లి సమావేశం తర్వాత ఈ విషయాన్ని బిజెపి జాతీయ నేతల దృష్టికి చంద్రబాబు తీసుకెళ్తారని తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు గనుక తన పట్టును నిరూపించుకుంటే టిడిపి అభ్యర్థికి బిజెపి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఏపీలో టిడిపికి బిజెపి సపోర్ట్ చేస్తుంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి టీడీపీ సపోర్ట్ చేస్తోంది. మొత్తంగా చూస్తే చంద్రబాబు గనుక బిజెపి జాతీయ నేతల మీద ఒత్తిడి గనుక తీసుకొస్తే సుహాసిని టిడిపి అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశం ఉంది. అని అనుకున్నట్టు జరిగితే జూబ్లీహిల్స్ స్థానంలో సుహాసిని గెలిస్తే.. తెలంగాణలో టిడిపి మళ్లీ తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే టిడిపికి ఏమాత్రం గెలుపు అవకాశాలుంటాయనేది చూడాల్సి ఉంది.