https://oktelugu.com/

AP CM YS Jagan: జగన్ వస్తున్నాడంటే.. అక్కడ సర్వనాశనమే

సీఎం శారదా పీఠం సందర్శనకు వచ్చినప్పుడు బీఆర్‌టీఎస్‌ రోడ్డు నుంచి పీఠం వరకు రోడ్డుకు ఇరువైపులా, డివైడర్‌పై చెట్లను అడ్డంగా నరికేశారు. ఇప్పుడు అదే మాదిరిగా వ్యవహరిస్తుండడంతో దండం బాబు ఈ సీఎంకు. ఎక్కడ అడుగుపెడితే అక్కడ సర్వనాశనమే

Written By:
  • Dharma
  • , Updated On : May 11, 2023 / 04:27 PM IST

    CM Jagan

    Follow us on

    AP CM YS Jagan: సాధారణంగా సీఎం పర్యటన అంటే ప్రజలు సంబరపడిపోతారు. తామ ప్రాంత అభివృద్ధికి నిధుల వరద పారిస్తారని భావిస్తారు. సాదరంగా ఆహ్వానిస్తారు. కానీ ఏపీలో మాత్రం ప్రజలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ పర్యటనలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. మాకొద్దు బాబోయ్ అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరదాల మాటున సాగించే సీఎం పర్యటనకు ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నారు. శాశ్వత నిర్మాణమని చూడడం లేదు.. పచ్చని చెట్టని కనికరించడం లేదు. ముఖ్యమంత్రి పర్యటన ఉంటే చాలూ అడ్డువచ్చే నిర్మాణాలు, అడ్డంకిగా నిలిచే చెట్లను తొలగిస్తున్నారు. విశాఖలో జగన్ పర్యటించనున్న నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మునిసిపల్ అధికారులు తొలగింపు పనులు షురూ చేశారు.

    రాజకీయ వేదికగా అంతర్జాతీయ స్టేడియం..
    ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం సాహసించని విధంగా జగన్ సర్కారు విశాఖలో సరికొత్త చర్యలకు పూనుకుంది. ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంనే సీఎం సభావేదికకు వినియోగిస్తున్నారు. గతంలో ఎవరూ ఇటువంటి చర్యకు దిగలేదు. ఏకంగా రాజకీయ వేదికగా మార్చేశారు. స్టేడియం మధ్యలో ఒక వేదిక ఏర్పాటు చేశారు. తొలుత క్రికెట్‌లో ఇటీవల ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులను సీఎంకు పరిచయం చేస్తారు. తరువాత అక్కడే భీమిలి నియోజకవర్గం పార్టీ నాయకులతో ఆయన సమావేశమై మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాన్ని ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని క్రికెట్ అసోసియేషన్ అధికారులు చెబుతున్నారు.

    డివైడర్లు ధ్వంసం..
    సీఎం పర్యటించే దారిపొడవునా డివైడర్లను తొలగించారు. షాపులు మూయించారు.  స్టేడియంలో కార్యక్రమం పూర్తయిన తరువాత జగన్‌ ఆర్‌కే బీచ్‌లో సీ హ్యారియర్‌ మ్యూజియం ప్రారంభోత్సవానికి వెళ్తారు. స్టేడియం నుంచి బయటకు వచ్చాక 200 మీటర్ల దూరం ముందుకు వెళ్లి యుటర్న్‌ తీసుకొని వెళ్లాల్సి ఉంది. అది ఇబ్బందికరమని భావించిన అధికారులు స్టేడియం ఎదురుగా జాతీయ రహదారిపై డివైడర్‌ను తొలగించేశారు. స్టేడియం నుంచి సీఎం నేరుగా ఇటువైపు వచ్చేలా మార్గం సిద్ధం చేశారు. ఇక స్టేడియానికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనున్న దుకాణాలను బుధవారమే మూయించేశారు. ఆర్‌కే బీచ్‌లో బుధ, గురువారాలు ఎటువంటి దుకాణాలు పెట్టకూడదని ఉదయమే ఆదేశాలు జారీచేశారు.

    చెట్లపై గొడ్డలి వేటు..
    అటు పచ్చదనాన్ని సైతం మాయం చేస్తున్నారు. దారిపొడవునా  చెట్లను నరికేయడంతో పాటు కొమ్మలను కొట్టేస్తున్నారు.  మొదళ్లను మాత్రమే ఉంచుతున్నారు. అవి మోడువారుతూ కనిపించడంతో నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంతో పాటు అధికారుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. కొద్దిరోజుల కిందట  సీఎం శారదా పీఠం సందర్శనకు వచ్చినప్పుడు బీఆర్‌టీఎస్‌ రోడ్డు నుంచి పీఠం వరకు రోడ్డుకు ఇరువైపులా, డివైడర్‌పై చెట్లను అడ్డంగా నరికేశారు. ఇప్పుడు అదే మాదిరిగా వ్యవహరిస్తుండడంతో దండం బాబు ఈ సీఎంకు. ఎక్కడ అడుగుపెడితే అక్కడ సర్వనాశనమే అంటూ కొందరు ఆగ్రహంతో నిష్టూరమాడుతున్నారు.