Nara Ramamurthy Naidu : నారా రామ్మూర్తి నాయుడు కన్ను మూసిన గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ తన తమ్ముడి పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన వెంట సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, ఇతర టిడిపి నాయకులు ఉన్నారు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు కుమారులు. రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ సినీ నటుడుగా రాణిస్తున్నారు. ఇటీవల ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయిన తర్వాతే ఆయన వెళ్లిపోయారు. తన సోదరుడు ఆసుపత్రిలో ఉండగా.. ఆ బాధ్యతను మొత్తం చంద్రబాబు నాయుడు భుజాలకు ఎత్తుకున్నారు.
కన్నీటి పర్యంతం
ఏఐజి ఆసుపత్రిలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని చూసి చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే ఉన్న రామ్మూర్తి నాయుడు కుమారులను పరామర్శించారు. రామ్మూర్తి నాయుడు డయాబెటిక్, అల్జీమర్స్ వ్యాధులతో దీర్ఘకాలంగా ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయనకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఈ విషయం నారా రోహిత్ పిఆర్ఓ మీడియాకు తెలియజేశారు. నారా రామ్మూర్తి నాయుడు 1990 కాలంలో టిడిపి లో చురుకైన నేతగా కొనసాగారు. 1994 నుంచి 1999 మధ్య కాలంలో చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పని చేశారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గల్లా అరుణకుమారి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2001లో చంద్రబాబుతో విభేదించి రామ్మూర్తి నాయుడు బయటకు వచ్చారు.. తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక 2003లో రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. 2006లో మళ్లీ చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే అనారోగ్య సమస్యల వల్ల రామ్మూర్తి నాయుడు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన కుమారుడు రోహిత్ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు.
బలమైన సంబంధ బాంధవ్యాలు..
చంద్రబాబు నాయుడు, రామ్మూర్తి నాయుడు మధ్య మొదటి నుంచి బలమైన బాంధవ్యాలు ఉండేవి. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎదిగేందుకు రామ్మూర్తి నాయుడు తెరవెనుక కృషి చేశారు అంటారు. చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఒకసారి మాత్రమే చంద్రబాబుతో రామ్మూర్తి నాయుడు విభేదించారని.. ఆ తర్వాత కలిసిపోయారని.. ఆయన అనారోగ్యానికి గురి కావడంతో రాజకీయాలకు దూరమయ్యారని టిడిపి అభిమానులు చెబుతుంటారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో జరుగుతాయని తెలుస్తోంది.