TTD Chairman Post : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు ని నియమిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. చైర్మన్ తో పాటు 24 మంది సభ్యులను కూడా ఎంపిక చేశారు. జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, జస్టిస్ హెచ్ ఎల్ దత్, యాదాద్రి రూపశిల్పి ఆనంద్ సాయి, ఎంఎస్ రాజు, నన్నపనేని సదాశివరావు, ప్రశాంతి రెడ్డి, పనబాక లక్ష్మి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన టిడిపి నాయకుడు నర్సిరెడ్డి వంటి వారికి అవకాశం లభించింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారికి కూడా అవకాశం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బీఆర్ నాయుడు నియామకంపై మొన్నటిదాకా సందిగ్ధం నెలకొంది. బీఆర్ నాయుడు కుమారుడు మాదకద్రవ్యాల కేసులో ఉన్నారని ఆమధ్య ఆరోపణలు వచ్చాయి. ఓ పత్రిక కూడా కుప్పలు తెప్పలుగా కథనాలను ప్రచురించింది. అయితే దీనిపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని టీవీ5 సంచలన ప్రకటన చేసింది. అయితే సాక్షి పత్రికలో ప్రచురితమైన డాక్యుమెంట్లు ఫేక్ అని టీవీ5 కొట్టి పారేసింది. ఈ నేపథ్యంలో తన సచ్చీలతను నాయుడు నిరూపించుకోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి లైన్ క్లియర్ అయింది.
జనసేన, బిజెపి నేతలకు కూడా
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి లో ఇతర రాజకీయ పార్టీల నాయకులకు కూడా అవకాశాలు లభించాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో.. ఆ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన, బిజెపి నాయకులకు పదవులు లభించాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి బొంగునూరి మహేందర్ రెడ్డికి అవకాశం లభించింది. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు, యాదాద్రి రూపశిల్పి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కి జనసేన కోటాలో సభ్యుడిగా అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు నర్సిరెడ్డికి సభ్యుడిగా పదవి లభించింది. ప్రభుత్వం ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో వివాద రహిత వ్యక్తులకే పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది.. బి ఆర్ నాయుడు పేరు చైర్మన్ గా ఎప్పుడు ఖరారు అయినప్పటికీ.. ఇటీవల ఆయన కుమారుడి మీద మాదకద్రవ్యాల ఆరోపణలు వినిపించాయి. దీనిని సాక్షి మీడియా ప్రముఖంగా ప్రచురించింది. బి ఆర్ నాయుడు కి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఒక్కసారిగా అంతర్మథనంలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ మాదకద్రవ్యాల కేసు ఉత్తిదేనని తేలిపోవడంతో బిఆర్ నాయుడు కు లైన్ క్లియర్ అయింది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమందిని సభ్యులుగా నియమించడంతో.. చంద్రబాబు సమతూకం పాటించాలని టిడిపి నాయకులు చెబుతున్నారు. లడ్డు వివాదం, అందులో జంతువుల కొవ్వు కలిపారని ఆరోపణలు.. ఆలయ నిధులను దుర్వినియోగం చేశారని విమర్శలు.. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీశాయి. మరి కొత్త పాలకమండలి అయినా తిరుమల తిరుపతి దేవస్థానం గొప్పతనాన్ని మరింత పెంచాలని వెంకటేశ్వర స్వామి భక్తులు కోరుతున్నారు.