https://oktelugu.com/

AP Budget: రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్..ఎప్పుడంటే?

రాష్ట్ర అభివృద్ధిలో బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు గత ఎనిమిది నెలలుగా తాత్కాలిక బడ్జెట్ కొనసాగుతోంది. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 18, 2024 / 09:16 AM IST

    AP Budget

    Follow us on

    AP Budget: రాష్ట్ర చరిత్రలోనే 8 నెలల పాటు ఓటాన్ బడ్జెట్ కొనసాగింది. సాధారణంగా ఎన్నికల సమయం, ప్రత్యేక పరిస్థితుల్లోనే తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. అయితే ఈసారి జగన్ సర్కార్ ఎన్నికలకు ముందు ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి నెలలో ఈ బడ్జెట్ సమర్పించింది. ఏప్రిల్ నుంచి జూలై 31 వరకు నాలుగు నెలల కాలానికి దాదాపు లక్ష పది కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ కి శాసనసభ ఆమోదం తీసుకున్నారు. అయితే జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కన జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. వైసిపి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేయడంతో ఆదాయ వ్యయాలపై ఒక అంచనాకు రాలేకపోయింది కూటమి ప్రభుత్వం. అందుకే ఆగస్టు నుంచి నవంబరు వరకు నాలుగు నెలల పాటు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. లక్ష 30 వేల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ తాత్కాలిక బడ్జెట్ కు గవర్నర్ నుంచి ఆమోదం తీసుకున్నారు. ఇలా రాష్ట్ర చరిత్రలోనే 8 నెలల పాటు తాత్కాలిక బడ్జెట్ తో నెట్టుకు రావడం విశేషం. అయితే నవంబర్ రెండవ వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

    * ఇకనుంచి పథకాలు ప్రారంభం
    ఈ ఎన్నికల్లో కూటమి చాలా రకాల హామీలు ఇచ్చింది. సూపర్ సిక్స్ పథకాలను కూడా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే కొన్ని పథకాలను అమలు చేసి చూపించారు. పింఛన్ మొత్తాన్ని పెంచారు. బకాయిలతో సహా చెల్లించారు. అన్న క్యాంటీన్లను తెరిచారు. మిగతా సంక్షేమ పథకాల అమలుకు సైతం కసరత్తు ప్రారంభించారు. నవంబర్ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటన్నింటికీ ఈ పూర్తిస్థాయి బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

    * కీలక కేటాయింపులు
    ఈ ఆరు నెలలకు సంబంధించి బడ్జెట్ ను రూపొందించే పనిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు రూ. 2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ఉండొచ్చని ప్రాథమిక అంచనా. సంక్షేమ పథకాలతో పాటు అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో పెద్దపీట వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణం చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం రాష్ట్ర బడ్జెట్ లోనే కాకుండా జాతీయస్థాయి ప్రాజెక్టులలో సైతం నిధులు చూపించనున్నట్లు తెలుస్తోంది. వివిధ కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తనవంతు వాటా సమకూర్చాలి. ఇలా 28 పథకాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చనున్నాయి. మొత్తానికి అయితే మరి కొద్ది రోజుల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానందన్నమాట.