Amrapali Kata: తెలంగాణ నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు డిప్యూటేషన్ పై అక్కడ కొనసాగిన ఈ ముగ్గురు.. స్వరాష్ట్రం వచ్చేందుకు పెద్దగా ఇష్టపడలేదు. కేంద్రం తప్పనిసరిగా వెళ్లాల్సిందేనని ఆదేశించడంతో వారు న్యాయపోరాటం చేశారు. అక్కడ కూడా వారికి చుక్కెదురు కావడంతో అమరావతికి వచ్చి రిపోర్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీ రబ్ కుమార్ ప్రసాద్ ను కలిశారు. ఏపీలో విధులు నిర్వహించేందుకు తమ సమ్మతం తెలిపారు. దీంతో వీరి సేవలను ఎలా వినియోగించుకుంటారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇందులో యువ ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి మంచి పేరు ఉంది. సమర్థత కలిగిన అధికారిగా గుర్తింపు సాధించారు ఆమె. ఆమెను మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మంత్రి నారాయణ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విశాఖ వంటి నగర అభివృద్ధికి ఆమె సేవలు అవసరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఆమెకు విశాఖతో మంచి అనుబంధమే ఉంది. ఆమె తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా సేవలు అందించారు. ఒంగోలు జిల్లాకు చెందిన ఆమ్రపాలి కొద్ది రోజులు విశాఖలోనే చదువుకున్నట్లు కూడా తెలుస్తోంది. విశాఖ నగరం గురించి ఆమెకు సమగ్రంగా తెలుసు. అందుకే జీవీఎంసీ కమిషనర్ గా నియమిస్తే మంచి సేవలు అందిస్తారని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* వికారాబాద్ సబ్ కలెక్టర్ గా
రాష్ట్ర విభజన తర్వాత ఆమె సర్వీస్ తెలంగాణలో కొనసాగింది. వికారాబాద్ సబ్ కలెక్టర్గా ఆమె తొలి పోస్టింగ్ దక్కింది. అక్కడ ఆమె తన పనితీరుతో ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా కూడా ఆమె కొంతకాలం పాటు పనిచేశారు. అందుకే ఆమె సేవలను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వద్ద ఇప్పుడు ఆరు శాఖలు ఉన్నాయి. సమర్థవంతమైన టీం ను సమకూర్చే పనిలో ఆయన ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న చురుకైన అధికారులను డిప్యూటేషన్ పై ఇక్కడకు తీసుకొస్తున్నారు.ఇప్పుడు ఆమ్రపాలి సైతం పవన్ టీంలో చేరనున్నట్లు మరో ప్రచారం ప్రారంభం అయింది.
* విశాఖ వైపే ముగ్గు
వైసిపి ప్రభుత్వం విశాఖను పాలన రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం విశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు పొందిన విశాఖకు ఆమ్రపాలి లాంటి సమర్థవంతమైన అధికారి లభిస్తే.. అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఉంది. అందుకే వీలైనంతవరకు ఆమ్రపాలిని విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ గా పంపించేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.