AP BJP President: ఏపీ( Andhra Pradesh) అధ్యక్ష పదవి నియామకం కోసం కసరత్తు ప్రారంభం అయింది. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పదవీకాలం ముగియనుండడంతో.. బిజెపి నిబంధనల మేరకు కొత్త నేత అధ్యక్షుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం చేయనుంది బిజెపి హై కమాండ్. సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు సిద్ధపడుతోంది. చాలామంది ఆశావహులు ఉన్నారు. అయితే ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గెలవడంతో మంత్రి పదవి ఆశించారు. కానీ సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయనకు చాన్స్ దక్కలేదు. అందుకే బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది.
Also Read: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి..కన్నీటి పర్యంతమైన భర్త..హృదయాలను పిండేస్తున్న వీడియో!
* ఉత్తరాంధ్ర నేతకు..
మరోవైపు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్( pvn Madhav) పేరు కూడా ప్రముఖంగా ఉంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా పదవి చేపట్టిన మాధవ్.. గడిచిన ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ ఆయనకు చాన్స్ దక్కలేదు. రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీ పదవి వస్తుందని కూడా ఆశించారు. అది కూడా దక్కలేదు. అయినా సరే కూటమి గెలుపు కోసం శ్రమించారు. ముఖ్యంగా ఆయన తరుపున సీఎం రమేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన సీఎం రమేష్ గెలుపు కోసం పివిఎన్ మాధవ్ గట్టిగానే కృషి చేశారు. అందుకే మాధవ్ కు బిజెపి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని సీఎం రమేష్ హై కమాండ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన మాధవ్ పార్టీ హైకమాండ్ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆది నుంచి పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఆయనకు అదే ప్లస్ పాయింట్ గా నిలవనుంది.
* రాయలసీమకు కేటాయింపు..
మరోవైపు రాయలసీమ( Rayalaseema ) రెడ్డి సామాజిక వర్గానికి బిజెపి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి సైతం పదవి ఆశిస్తున్నారు. కానీ ఆయన విషయంలో కూటమి పార్టీల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. మరోవైపు పులివెందులకు చెందిన ఓ నాయకుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఆ నేతకు ప్రోత్సాహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాయలసీమలో భారతీయ జనతా పార్టీ బలపడాలంటే రెడ్డి సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందేనని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అంటే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో ఏదో ఒక ప్రాంతానికి ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.
* పురందేశ్వరి కొనసాగింపు?
మరోవైపు ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని( purandeswari) కొనసాగిస్తారని కూడా ప్రచారం సాగుతోంది. బిజెపిలో రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉంది. 2023లో అధ్యక్ష పదవి చేపట్టిన పురందేశ్వరి రెండేళ్ల పాటు పార్టీని చక్కగా నడిపారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ మొన్నటి ఎన్నికల్లో బిజెపికి ఓట్లతో పాటు సీట్లు కూడా సాధించి పెట్టారు. మిగతా రెండు పార్టీల అధినేతలకు ధీటుగా.. పురందేశ్వరి నిలబడ్డారు. అందుకే ఆమె కొనసాగింపు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. అయితే ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా ఒక టాక్ ఉంది. అదే జరిగితే ఆమెను తప్పించడం ఖాయం. ఆమెను తప్పిస్తే ఆమె స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరికి ఛాన్స్ దక్కుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.