AP Assembly Elections 2024: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియా ఫరిడవిల్లుతోంది. కానీ దేశంలో ఓటుకు నోటు ఇవ్వనిదే పని కాదన్నది జగమెరిగిన సత్యం. 70 కోట్ల మంది ఓట్లు వేసుకుని గెలిపించుకునే గ్రేట్ ఇండియన్ డెమోక్రసీ డబ్బు అనే అంశం చుట్టూ తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పేరుకే ప్రజాస్వామ్యం కానీ అసలు సిసలైన ధనస్వామ్యంగా మారిపోయింది. భారత్ లో ప్రజాస్వామ్యం దిగజారిపోతోందని అంతర్జాతీయ సమాజం కోడై కూస్తోంది. ఓటుకు 5000 ఇచ్చి గెలిచామని ఇప్పుడు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఓటరు అమ్ముడుపోతున్నాడు. నాయకుడు అంతకంటే అమ్ముడుపోతున్నాడు. రాజకీయ విలువలు అన్ని నోటీసు బోర్డులకే పరిమితం అవుతున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఆర్థికంగా బలమైన నేతలను బరిలో దించుతున్నాయి.
ఏపీలో కొన్ని జిల్లాల్లో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారని సమాచారం. అంత డబ్బు లేనిదే ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని అభ్యర్థులు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రధానంగా గుంటూరు, కృష్ణ,ఉభయగోదావరి జిల్లాలో డబ్బు ప్రవాహం అధికంగా ఉంటుంది. ఒక్కో అభ్యర్థి 50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన నియోజకవర్గానికి రెండు పార్టీల అభ్యర్థులు 100 కోట్ల రూపాయలు పంచాల్సిందేనన్నమాట. లేకుంటే గెలుపు పై నమ్మకం కుదరదు. చివరకు వెనుకబడిన జిల్లాల్లో సైతం ఒక్కో అభ్యర్థి పాతిక కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
సంక్షేమ పథకాలు అమలు చేసిన తరువాత ప్రజలను సంతృప్తి పరచడం చాలా కష్టం. 100, 200 రూపాయలను చులకనగా చూసిన రోజులు ఇవి. 500 రూపాయలు కూడా తక్కువగానే చూస్తున్నారు. 2000 వరకు ఇస్తేనే కాస్త సంతృప్తి పడుతున్నారు. అంటే ఓ కుటుంబ ఓట్లు దక్కాలంటే ఏ స్థాయిలో ఖర్చు పెట్టాలి. ఎంత ఇవ్వాలి. విపక్షం 1000 రూపాయలు ఇస్తే.. అధికారపక్షం 2000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే కచ్చితంగా ఓటు పై నమ్మకం ఉంటుంది. తమకే ఓటు వేస్తారని భావించాల్సి ఉంటుంది. వెయ్యి రూపాయల కంటే తక్కువగా ఇచ్చినా ఆ ఓటుకు అస్సలు గ్యారెంటీ ఉండదు. కొందరైతే రెండు పార్టీల అభ్యర్థుల దగ్గర నగదు తీసుకుంటారు. అక్కడే గెలుపోటముల అంచనాలో తేడా కొడుతుంది. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు ఖర్చు మారిపోతుంది. ప్రజాస్వామ్యం ఖరీదైన వస్తువుగా మారుతోంది.