Homeఆంధ్రప్రదేశ్‌AP Assembly Election Results 2024: టిడిపి సరికొత్త రికార్డు.. నాలుగు దశాబ్దాల్లో ఆరోసారి అధికారం!

AP Assembly Election Results 2024: టిడిపి సరికొత్త రికార్డు.. నాలుగు దశాబ్దాల్లో ఆరోసారి అధికారం!

AP Assembly Election Results 2024: నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తెలుగుదేశం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. ఒక ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాలకు మనగలడం అంత సామాన్య విషయం కాదు. జాతీయ పార్టీలే కాలంతో పాటు మారలేక సతమతమవుతున్నాయి. అటువంటిది ఒక ప్రాంతీయ పార్టీగా అనేక ఆటుపోట్లు తట్టుకొని నిలబడింది తెలుగుదేశం పార్టీ. జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించింది. ఉమ్మడి రాష్ట్రంలో 16 సంవత్సరాలు, అవశేష ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు… మొత్తం 21 సంవత్సరాలు పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగింది. ఎన్టీఆర్ వేసిన బలమైన పునాదులు, చంద్రబాబు వ్యూహాలు, అంతకుమించి నిబద్దత కలిగిన టిడిపి కార్యకర్తల వల్లే తెలుగుదేశం పార్టీ ఈ స్థితికి చేరుకుంది.

1983 మార్చి 28న తెలుగుదేశం పార్టీని ప్రకటించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలకు ఒక దిక్సూచిగా నిలిచింది. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూల దోయడం, ఆ తరువాత ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం జరగడం.. కాంగ్రెసేతర పార్టీలకు తెలుగుదేశానికి దగ్గర చేసింది. 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సానుభూతి పవనాలతో అన్ని పార్టీలు కొట్టుకెళ్లిపోయాయి ఆ సమయంలో జాతీయ స్థాయిలో నిలబడి విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి.. నాలుగున్నర సంవత్సరాల పాటుప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది. జాతీయస్థాయిలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ చైర్మన్ అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వానికి నాంది పలికారు. దానిని కొనసాగింపుగా 1996 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పరిస్థితుల్లో చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు చొరవ చూపారు. దానికి చైర్మన్గా వ్యవహరించారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన జీఎంసీ బాలయోగి లోక్సభ స్పీకర్ అయ్యారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రధానిని చేయడంలో కూడా చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషించారు.

రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఎన్నో సంక్షోభాలను అధిగమించింది తెలుగుదేశం పార్టీ. 1995లో ఎన్టీఆర్ నుంచి పార్టీని స్వాధీనం చేసుకున్న సమయంలో.. ఇక టిడిపి పని అయిపోయిందని ఎక్కువ మంది భావించారు. కానీ చంద్రబాబు తన సమర్థతతో పార్టీని నడిపించారు. 1999 ఎన్నికల్లో గెలుపు బాటలో నడిపారు. కానీ ఇంకా తొమ్మిది నెలల సమయం ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. నాడు కేంద్రంలో ఉన్న వాజ్పేయి ప్రభుత్వాన్ని సైతం ముందస్తుకు తీసుకెళ్లారు. ఆ ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వానికి ఓటమి తప్పలేదు. 2009 ఎన్నికల్లోఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. మిగతా రాజకీయ పక్షాలతో మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశారు. అయినా సరే గెలుపు దక్కలేదు.

రాష్ట్ర విభజన తరువాత 2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నేత కావాలని భావించిన ఏపీ ప్రజలు చంద్రబాబును సీఎంగా ఎన్నుకున్నారు. ఐదు సంవత్సరాలపాటు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు అహర్నిశలు శ్రమించారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ విన్నపానికి ఏపీ ప్రజలు మెత్తబడ్డారు. జగన్ సంక్షేమ పథకాలకు జై కొట్టారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. దారుణ ఓటమి ఎదురయ్యేసరికి టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన నిర్లిప్తత కనిపించింది. అయినా సరే మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో బిజెపి దూరం కావడంతో ఎదురైన పరిణామాలను గ్రహించుకొని.. మరోసారి ఆ పార్టీతో జతకట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఈ క్రమంలో పవన్ ను ముందుగా స్నేహితుడిగా చేర్చుకున్నారు. ఆయన సహకారంతో బిజెపిని దగ్గర చేసుకున్నారు. సీట్ల సర్దుబాటు నుంచి ఉమ్మడి ప్రచారం వరకు సమన్వయంతో వ్యవహరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే మూడు పార్టీల మధ్య సమన్వయం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. పవన్ సాయం తీసుకోవడంలో కూడా విజయవంతం అయ్యారు. అటు బిజెపిని కలుపుకొని ఎన్నికల నిర్వహణలో అవసరమైన సాయాన్ని పొందగలిగారు. చంద్రబాబు ఆలోచన పనిచేసింది. వ్యూహాలు పనిచేశాయి. ఈ విజయానికి అవే కారణం అయ్యాయి. మొత్తానికైతే 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ.. ఆరోసారి అధికారంలోకి వచ్చింది. సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular