AP And Telangan
AP And Telangan: ఆంధ్రప్రదేశ్ (ఏపీ), తెలంగాణ రాష్ట్రాల రాజకీయాలు గత కొన్నేళ్లలో ఒకదానికొకటి పూర్తి భిన్నమైన దారుల్లో సాగుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఏపీలో రాజకీయ వాతావరణం వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలంతో కలుషితంగా ఉంటే, తెలంగాణలో అదే సమయంలో సాపేక్షంగా పద్ధతిగల, కానీ దూకుడుతో కూడిన రాజకీయం కనిపించేది. ఇప్పుడు పరిస్థితులు తారుమారైనట్లు కనిపిస్తున్నాయి.
Also Read: ఏపీలో డీఎస్సీకి లైన్ క్లియర్.. నోటిఫికేషన్ కు కసరత్తు!
ఒకప్పుడు కలిసి ఉండి.. పునర్విభజనతో విడిపోయిన ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రాజకీయ పరిణామాలు కూడా భిన్నంగా మారాయి. ఉమ్మడిగా ఉన్నా.. విభజిత రాష్ట్రాల్లో అయినా మొదటి నుంచి రాజకీయాలు భిన్నంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో శాంతియుత, సంప్రదాయ రాజకీయం నడుస్తుండగా, తెలంగాణలో దూషణలు, వ్యక్తిగత కక్షలతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ రెండు రాష్ట్రాల రాజకీయాలు రాముడు–భీముడిలా భిన్న రీతుల్లో సాగుతున్నాయి.
ఏపీలో క్లీన్ అండ్ గ్రీన్ పాలిటిక్స్..
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసభ్యత, దూషణలతో నిండి ఉండేవి. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఈ చిత్రం పూర్తిగా మారిపోయింది. గతంలో బూతు రాజకీయాలకు పెట్టింది పేరైన నాయకులు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నుంచి అధికారికంగా మాట్లాడే వారిలో అంబటి రాంబాబు తప్ప ఎవరూ ముందుకు రావడం లేదు. పార్టీకి సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) వంటి కీలక నేతలు కూడా మీడియా ముందుకు రావడం మానేశారు. విపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS.Jagan Mohan Reddy) అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా, అప్పుడప్పుడూ ప్రెస్‌మీట్‌లలో స్క్రిప్ట్ చదివి వెళ్లిపోతున్నారు. ఆయన రాజకీయం చూస్తే, ఇంకా గత ఓటమి నుంచి కోలుకోలేదని స్పష్టమవుతుంది.
అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings) ఈ కొత్త రాజకీయ వాతావరణానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వైసీపీ(YCP)కి మండలిలో ఆధిక్యం ఉన్నప్పటికీ, చర్చల్లో పాల్గొనే ధైర్యం లేక వాకౌట్ చేస్తోంది. అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ వంటి వారు కొంత ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తించినా, మొత్తంగా వైసీపీ నిర్వీర్యమైనట్లే కనిపిస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం (టీడీపీ, బీజేపీ, జనసేన) పాలన సరదాగా, సాఫీగా సాగుతోంది. లా అండ్ ఆర్డర్ మెరుగైంది, అక్రమ అరెస్టులు ఆగాయి, ప్రజల్లో భయం తగ్గింది. ఎమ్మెల్యేలు ఆటపాటలతో సమావేశాలను సందడిగా మార్చడం ఈ సానుకూల వాతావరణానికి నిదర్శనం.
తెలంగాణలో ధూషణల పర్వం..
తెలంగాణలో గతంలో రాజకీయం దూకుడుగా ఉన్నా, అసభ్యత తక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దూషణలు, వ్యక్తిగత దాడులతో రాజకీయం కలుషితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్‌ఎస్(BRS) నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై వ్యక్తిగత దాడులకు దిగారు. కేటీఆర్ వంటి నాయకులు రేవంత్‌ను ఏకవచనంతో సంబోధిస్తూ, గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలోనూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తీవ్రమైన దూషణలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్ట్, యూట్యూబర్ల అరెస్టులు జరిగినా, సమాజం నుంచి స్పందన రాకపోవడం గమనార్హం.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం, సిలిండర్‌పై సబ్సిడీ, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుస్తోంది. బీఆర్‌ఎస్ హయాంలో ఇంత స్థాయిలో సంక్షేమం లేదని రేవంత్ వాదిస్తున్నారు. అయినా, బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వ విజయాలపై చర్చించకుండా, వ్యక్తిగత దూషణలతో వ్యతిరేకతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానం తెలంగాణ రాజకీయాలను ఏపీ గత రాజకీయాల తరహాలో మలుచుతోంది.
పోలికలు.. పాఠాలు
ఏపీలో ఇప్పుడు రాజకీయం శాంతియుతంగా, సంప్రదాయ బద్ధంగా సాగుతుండగా, తెలంగాణలో వ్యక్తిగత కక్షలు, దూషణలతో కలుషితమైంది. ఏపీలో వైసీపీ నిర్వీర్యమవడం కూటమి పాలనకు బలం చేకూర్చగా, తెలంగాణలో అధికార–ప్రతిపక్షాల మధ్య సమరం తీవ్రమైంది. ఏపీ గత ఐదేళ్ల అనుభవాలు తెలంగాణకు గుణపాఠంగా ఉండాలి. రాజకీయంలో వ్యక్తిగత శత్రుత్వాలు చివరకు ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాయి. ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నారని వారు అంగీకరిస్తున్నారని భావించడం రాజకీయ పార్టీల మూర్ఖత్వమే. ఓటు రూపంలో వారి స్పందన తప్పక వస్తుంది.