Vemireddy Prabhakar Reddy: వైసీపీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను జగన్ మార్చుకున్నారు. దాదాపు 70 మంది సిట్టింగులను మార్చారు. కొంతమందిని పక్కన పడేశారు. మరికొందరికి అనూహ్యంగా అవకాశాలు ఇచ్చారు. అయితే చాలాచోట్ల ఇష్టం లేని స్థానాలను కల్పించారు. ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మార్చారు. అయితే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు నేతలు ఉత్సాహం చూపుతున్నారు. కానీ ఎంపీలుగా పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాని పరిస్థితి. దీంతో చాలామంది మేము పోటీ చేయలేమంటూ తేల్చి చెబుతున్నారు. మొన్నటికి మొన్న కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి గుమ్మనూరు జయరాం తాను పోటీ చేయనని తేల్చేశారు. ఇప్పుడు ఆ వంతు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి వచ్చింది.
సీఎం జగన్ కు అత్యంత వీర విధేయుడు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. ఆర్థికంగా కూడా తన వంతు సాయం అందించారు. అందుకే జగన్ సైతం ప్రభాకర్ రెడ్డికి రాజ్యసభ స్థానం కట్టబెట్టారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను సైతం ఎంపీగా పోటీ చేయలేనని హై కమాండ్ కు తేల్చి చెప్పడం విశేషం. అయితే కేవలం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీరుతోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. దీంతో వైసిపి హైకమాండ్ తల పట్టుకుంటుంది.
ఇటీవల నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి ఖలీల్ పేరును వైసిపి ఖరారు చేసింది. పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కనీసం సంప్రదించకుండా అభ్యర్థిని ప్రకటించినట్లు తెలిసింది. వాస్తవానికి తన భార్యను బరిలోదించాలని ప్రభాకర్ రెడ్డి చూశారు. అప్పుడే తాను ఎంపీగా పోటీ చేయగలనని హై కమాండ్ కు ఇదివరకే చెప్పారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ అభ్యంతరంతో ప్రభాకర్ రెడ్డి భార్యను జగన్ పక్కన పెట్టారు. అనిల్ అభ్యర్థన మేరకే ఖలీల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి మనస్థాపంతో ఉన్న ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్ళిపోయారు. అయితే అంతటితో ఆగని అనిల్ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తిట్టిపోస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వేంరెడ్డి మరింత ఆవేదనకు గురయ్యారు. పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉంటే.. తనతో పాటు తన భార్యను కూడా అనిల్ తిట్టాల్సిన అవసరం ఏంటని తీవ్ర మనస్థాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. తనకంటే అనిల్ కు జగన్ ప్రాధాన్యం ఇస్తుండడంతో పార్టీ నుంచి తప్పుకోవడమే మేలని.. రాజకీయాల నుంచి సైతం దూరం అవుతానని అనుచరులు, అభిమానుల వద్ద వేంరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన తీరు చూస్తుంటే వైసీపీకి దూరమైనట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.