CM Jagan: ఎన్నికల ప్రచారంలో వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కిందిస్థాయి క్యాడర్ నుంచి కీలక నేత వరకు అందరినీ ఒకే తాటిపై నడిపించడంలో జగన్ ముందు ఉంటారు. ఓవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు అవసరమైన ప్రచారానికి ప్రాధాన్యమిస్తారు. ఒకవైపు సోషల్ మీడియా ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తూనే.. మరోవైపు పవర్ఫుల్ పాటలను రూపొందించి ప్రజల్లోకి వదులుతుంటారు. గత ఎన్నికల్లో ప్రముఖ గాయని మంగ్లీ పాడిన పాట వైసీపీ శ్రేణులతో పాటు సామాన్య జనాలను సైతం ఆకర్షించింది. ఇప్పుడు ఎన్నికల ముంగిట సైతం సరికొత్త పాటలతో వైసిపి ముందుకు సాగుతోంది. తాజాగా సీఎం జగన్ పై రిలీజ్ అయిన పాట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.
2019 ఎన్నికల సమయంలో ‘రావాలి జగన్ కావాలి జగన్’ అనే సాంగ్ మార్మోగింది. ఏకంగా కొన్ని లక్షల మిలియన్ల వ్యూస్ రాబెట్టింది. కొద్ది రోజుల కిందట ఏపీలో విపక్షాలు కూటమి కట్టిన నేపథ్యంలో ‘ జెండాలు జతకట్టడమే నీ అజెండా’ అంటూ రిలీజ్ అయిన సాంగ్ ప్రేక్షకాదరణ పొందింది. మళ్లీ జగన్ అంటూ మరో కొత్త సైతం ఉర్రూతలూగిస్తోంది. ప్రముఖ గేయరచయితలతో ఈ పాటలు రాయిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకులతో పాటలను రూపొందిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఈ పాటలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ సైతం టిడిపి బాట పట్టింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో.. వారు సైతం ప్రత్యేక పాటలు రూపొందించుకునే పనిలో పడ్డారు. దీంతో రికార్డింగ్ థియేటర్లకు, కళాకారులకు గిరాకీ ఏర్పడింది.
అయితే తాజాగా మరో పాట ఇప్పుడు వైసిపి విడుదల చేసింది. ‘ఉయ్ లవ్ జగన్’ అంటూ సాగే ఈ పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.’ తరతరముల తలరాతల వెతలను మార్చిన నీ కథ మరువలేముగా’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. మరోవైపు వైసీపీకి అనుకూలంగా యూట్యూబ్లో సైతం పాటలు దర్శనమిస్తున్నాయి. పిఠాపురంలో వైసీపీ యువత సందడి పేరిట ఓ వీడియో హల్చల్ చేస్తోంది. అటు టిడిపి తో పాటు జనసేన పాటలు సైతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.