Janasena: జనసేనకు మరో పదవి.. ఛాన్స్ ఎవరికో?

రాష్ట్ర మంత్రివర్గంలో జనసేనకు మూడు పదవులు కేటాయించారు. అందులో ఇద్దరు కాపు కాగా.. మరొకరు ఓసి ఉన్నారు. అయితే ఈసారి పదవిని బ్రాహ్మణులకు కానీ.. బీసీలకు కానీ ఇవ్వాలని చూస్తున్నారు.

Written By: Dharma, Updated On : June 17, 2024 11:05 am

Janasena

Follow us on

Janasena: ఏపీ ప్రభుత్వంలో జనసేనకు కీలక భాగస్వామ్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, పర్యావరణ, అటవీ శాఖలను కేటాయించారు. మరో నేత నాదెండ్ల మనోహర్ కు పౌరసరఫరాల శాఖ దక్కింది. కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా అవకాశమిచ్చారు చంద్రబాబు. అయితే ఇప్పుడు జనసేనకు మరో కీలక పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఆ పార్టీకి విడిచి పెట్టాలని కూటమి నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర మంత్రివర్గంలో జనసేనకు మూడు పదవులు కేటాయించారు. అందులో ఇద్దరు కాపు కాగా.. మరొకరు ఓసి ఉన్నారు. అయితే ఈసారి పదవిని బ్రాహ్మణులకు కానీ.. బీసీలకు కానీ ఇవ్వాలని చూస్తున్నారు. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవిని మహిళలకు కేటాయించాలని జనసేనాని నిర్ణయిస్తే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి అవకాశం దక్కనుంది. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆమె. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆమెకు కలిసి వచ్చే అంశం. వైసిపి హయాంలో డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి వ్యవహరించారు. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అందుకే ఈసారి అదే సామాజిక వర్గానికి చెందిన లోకం నాగ మాధవిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

బీసీ నేతలకు ఇవ్వాలని చూస్తే నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రేసులో ఉండే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నవారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండదు. అందుకే నాయకర్ సేవలను పార్టీ బలోపేతానికి వాడుకోవాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ కీలక బాధ్యతలను బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకర్ కు అప్పగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఒక అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితి మేరకు జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఖాయం. కానీ ఎవరిని నియమిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. లోకం మాధవి, పంతం నానాజీల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.