Cholla Bojjireddy: ఏపీ ప్రభుత్వం( AP government) వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా సలహాదారుల నియామకంలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ఆయా రంగాల్లో నిపుణులు, నిష్ణాతులను మాత్రమే ఎంపిక చేస్తోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డికి క్యాబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ హోదాకు అనుగుణంగా జీతభత్యాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అయితే మొన్ననే ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజుకు సలహాదారు పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు కార్టూనిస్ట్ శ్రీధర్ కు సైతం సలహాదారు పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే.
గత ఏడాది మేలో..
ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డికి ( Bojji Reddy )గత ఏడాది మే నెలలోనే ఎస్టి కమిషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆయనది అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం. బొజ్జి రెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన బిజెపిలో చేరి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం గుర్తించి కీలకమైన ఎస్టి కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. ఇప్పటివరకు నామినేటెడ్ పదవుల్లో ఉన్న ముగ్గురుకి క్యాబినెట్ హోదా కల్పించింది ఏపీ ప్రభుత్వం. వీరిలో ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్ జవహర్ ఒకరు. మరొకరు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కు సైతం క్యాబినెట్ హోదా కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో చేరారు ఎస్టి కమిషన్ చైర్మన్ బొజ్జి రెడ్డి.
బిజెపిలో సీనియర్ నేతగా..
అల్లూరి( Alluri district) జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంలో ఈసారి టిడిపి గెలిచింది. ఓ సామాన్య అంగన్వాడీ కార్యకర్త శిరీష దేవి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె గెలుపు వెనక బొజ్జిరెడ్డి కృషి ఉంది. మొదట్లో గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అటు తరువాత ఆర్ఎస్ఎస్ లో కూడా కీలకంగా పని చేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో బిజెపి తరఫున రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న ఆయనకు.. కూటమి ప్రభుత్వం ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. ఆయనకు క్యాబినెట్ హోదా కొనసాగనుంది.