Mega DSC In AP: ఏపీ ప్రభుత్వం ( AP government) దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమంపై దృష్టి పెట్టింది. ఉద్యోగ,ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేయాలని కూడా చూస్తోంది. అందులో భాగంగా మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. తమ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి తగ్గట్టుగానే 16,347 పోస్టులను భర్తీ చేశారు. కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారు. ఇటువంటి సమయంలోనే నారా లోకేష్ మరో కీలక ప్రకటన చేశారు. ఏటా డీఎస్సీ కి సంబంధించి ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నామని.. వచ్చే ఏడాది మెగా డీఎస్సీ ఉంటుందని తాజాగా ప్రకటించారు. దీంతో నిరుద్యోగుల్లో సందడి నెలకొంది.
* మాట తప్పిన జగన్..
2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) అధినేత జగన్మోహన్ రెడ్డి డీఎస్సీ నిర్వహణపై హామీ ఇచ్చారు. ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. కానీ డీఎస్సీ నియామక ప్రక్రియను చేపట్ట లేకపోయారు. 2024 ఎన్నికలకు ముందు 6000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. అక్కడకు రోజుల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఏటా ఈ ప్రక్రియను కొనసాగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తొలి ఏడాదిలోనే 16 వేల పోస్టులను భర్తీ చేసి చూపించారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి.. 2026- 27 విద్యా సంవత్సరం ప్రారంభానికే ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేస్తామని తాజాగా లోకేష్ వెల్లడించారు. దీనిపై నిరుద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
* లోకేష్ సంచలన ట్వీట్..
ఈ ఏడాది ఏప్రిల్ లో మెగా డీఎస్సీ( Mega DSC ) నోటిఫికేషన్ జారీ అయింది. నాలుగు నెలల వ్యవధిలోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తయింది. 2026 జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి.. మార్చిలో పరీక్షలు నిర్వహించి.. వేసవిలో ఈ ప్రక్రియను పూర్తి చేసి.. కొత్త విద్యా సంవత్సరంలో పోస్టింగులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విషయాన్ని లోకేష్ ప్రకటించారు. తన ఎక్స్ పోస్టులో ప్రకటన జారీ చేశారు.’ పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష చేశాను. ఏటా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీని ప్రభుత్వం కట్టుబడి కొనసాగిస్తుంది. ఈ ఏడాది నవంబర్ మూడో వారంలో టేట్, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. టెట్, డీఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేర్యాల ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు. మొత్తానికి అయితే మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.