AP Rains : ఏపీకి భారీ వర్ష సూచన. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారి బలపడే అవకాశం ఉంది. అందుకే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. ప్రధానంగా మంగళవారం కడప, శ్రీ సత్య సాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్ష సూచనతో రైతులు అప్రమత్తమయ్యారు. ధాన్యం సంరక్షించుకునే పనిలో పడ్డారు. కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
* 14న మరో అల్పపీడనం?
అయితే ఈ అల్పపీడనం కొనసాగుతుండగానే ఈనెల 14 లేదా 15వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అయితే దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు ఏపీకి ఎప్పుడు విపత్తులే. మొన్నటి ఫంగల్ తుఫాను భయం వీడిందో లేదో.. మరో తుఫాన్ వెంటాడింది. ఇప్పుడు తాజాగా మరో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇంతలోనే మరో తుఫాన్ హెచ్చరిక వచ్చింది. 14న, లేదా 15న తుఫాన్ ఖాయమని తెలుస్తోంది. దీంతో రైతుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
* అపార నష్టం
వరుస వర్షాలతో పంటలకు అపార నష్టం కలుగుతోంది. ఈ తరుణంలో వ్యవసాయ శాఖ అప్రమత్తం అయ్యింది. ఎకరానికి 25 కిలోల చొప్పున ఉప్పును వరి పనలపై వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కోసిన వరి చేనుపై ఉప్పుతో కూడిన ద్రావణాన్ని పిచికారి చేయాలంటున్నారు. అలా చేస్తే చేను తడిచిన మొలక రాదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను అప్రమత్తం చేస్తున్నారు.