Vishaka : విశాఖలో మరో కిడ్నాప్ కలకలం.. బాధితులే కిడ్నాపర్లు

అయితే ఎందుకు కిడ్నాప్ చేశారని వారిని అడుగగా వారు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అవి విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వీరంతా దంపతుల చేతిలో మోసపోయేవారని తెలుసుకున్నారు.

Written By: Dharma, Updated On : June 30, 2023 1:36 pm
Follow us on

Vishaka : విశాఖ నగరంలో వరుసగా జరుగుతున్న కిడ్నాప్ లు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఉదంతం మరువక ముందే… ఓ దంపతులను కిడ్నాప్ చేసి తీసుకెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను రక్షించారు. కిడ్నాపర్లను పట్టుకున్నారు. అయితే ఈ ఘటనలో కిడ్నాపర్లది వింత పరిస్థితి. వారు తమకు జరిగిన మోసాన్ని భరించలేకే కిడ్నాపునకు దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి విశాఖ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రాజమండ్రికి చెందిన పట్నాల శ్రీనివాసరావు విశాఖలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య లక్ష్మి అదే సంస్థలో టెలీకాలర్ గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ వచ్చిన ఓ ముఠా దంపతులిద్దర్ని అపహరించి కారులో విజయవాడ తరలించే ప్రయత్నం చేసింది. అక్కయ్యపాలెంలో కారు ఎక్కించి తీసుకెళుతుండగా.. అనకాపల్లి సమీపంలో టాయిలెట్ కోసం ఆపారు. అప్పుడు లక్ష్మి గట్టిగా కేకలు వేయడంతో ఆమెను అక్కడే విడిచిపెట్టి శ్రీనివాసరావును తీసుకెళ్లిపోయారు. లక్ష్మి 100కు ఫోన్ చేసి ఫిర్యాదుచేసింది. దీంతో తూర్పుగోదావరి పోలీసులు అలెర్టయ్యారు. కిడ్నాపర్లను పట్టుకున్నారు. వారి చెర నుంచి శ్రీనివాసరావును విడిపించారు.

ఈ ఘటనకు సంబంధించి బ్రహ్మయ్య, సాయినిఖిల్, వీర మణికంఠలను అరెస్ట్ చేశారు. అయితే వీరితో పాటు మరికొందరు వచ్చినట్టు తెలిసింది. అయితే ఎందుకు కిడ్నాప్ చేశారని వారిని అడుగగా వారు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అవి విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వీరంతా దంపతుల చేతిలో మోసపోయేవారని తెలుసుకున్నారు. శ్రీనివాసరావుపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. 2012లో తక్కువ ధరకు వస్తువులు ఇస్తామని చెప్పి నర్సీపట్నంలో డిపాజిట్లు సేకరించి దుకాణం ఎత్తేశాడు. 2013లో కృష్ణా జిల్లా కంచికర్లలో ఓ అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. చెక్ బౌన్స్ కేసులు సైతం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

అయితే అన్నింటికీ మించి కిడ్నాప్ వెనుక భారీ మోసం ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెటింగ్ లో అనుభవం ఉన్న శ్రీనివాసరావును నమ్మి చాలా మంది లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి  కన్స్ ట్రక్షన్ కంపెనీ పెట్టించారు. సుమారు రూ.3.36 కోట్లు వసూలు చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి సొమ్ములు ఇవ్వక.. ప్లాట్లు విక్రయించిన వారికి కమీషన్ ఇవ్వకుండా శ్రీనివాసరావు పరారయ్యాడు. అప్పటి నుంచి ప్రాంతాలను మకాం మార్చుతూ వచ్చాడు. విశాఖలో ఉన్నట్టు తెలుసుకున్న బాధితులు రెండు వాహనాల్లో వచ్చి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులను విజయవాడ తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే సెటిల్ చేసుకోవాలని భావించారు.ఈలోగా పోలీసులు ఎంటర్ కావడంతో దానిని భగ్నం చేశారు. తాము బాధితులమే తప్ప.. నిందితులం కాదని వారు చెబుతున్నారు.