Governor post for TDP: బిజెపి( Bhartiya Janata Party) ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. వరుసగా వస్తున్న ఎన్నికల్లో ఇండియా కూటమి పట్టు బిగిస్తే పరిస్థితి ఏంటి అనే దానిపై దృష్టి పెట్టింది బిజెపి. అందుకే మిత్రులతో మైత్రిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. మొన్నటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది ఎన్డీఏ. కానీ ఎక్కడో ఒక అనుమానం. బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతే.. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే.. అస్సాంలో బిజెపి ఓడిపోతే.. తమిళనాడులో డిఎంకె, కాంగ్రెస్ సంకీర్ణ కూటమి అధికారంలోకి వస్తే తప్పకుండా బిజెపి పై ప్రభావం చూపక తప్పదు. ఎందుకంటే వరుసగా మూడుసార్లు ఎన్డీఏ అధికారంలో ఉంది. సహజంగానే ఎన్డీఏ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు ఇండియా కూటమి పట్టు బిగిస్తే మాత్రం ఎన్డీఏకు ఇబ్బందికరమే. అందుకే ఇప్పుడు కేంద్రం మిత్రులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చంద్రబాబును రాజకీయంగా ప్రోత్సాహం అందించడం ద్వారా జాతీయ స్థాయిలో తమ బలం ప్రజలం చేసుకోవాలని మోడీ, షా ధ్వయం చూస్తోంది.
కీలక భాగస్వామి..
కేంద్రంలో ఎన్డీఏ( National democratic Alliance ) మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు దోహద పడింది తెలుగుదేశం పార్టీ. ఏపీ నుంచి టీడీపీ నేతృత్వంలోని కూటమి 21 మంది ఎంపీలను అందించింది. తద్వారా కేంద్రంలో మూడోసారి బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగలిగింది. అందుకే టిడిపికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది కేంద్రం. కేంద్ర మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు ఇచ్చింది. ఒక గవర్నర్ పోస్ట్ కేటాయించింది. ఇప్పుడు తాజాగా మరో కేంద్ర మంత్రి పదవితో పాటు గవర్నర్ పోస్ట్ ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో సైతం ప్రభావం చూపినట్టే. కేంద్ర మంత్రివర్గం విస్తరణ, గవర్నర్ పోస్టుల నియామకం చేపడుతున్న క్రమంలో చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
రెండు మంత్రి పదవులు..
కేంద్ర మంత్రివర్గంలో కీలక భాగస్వామిగా ఉంది తెలుగుదేశం( Telugu Desam). ఆ పార్టీ నుంచి 16 మంది ఎంపీలు గెలిచారు. అందులో శ్రీకాకుళం నుంచి గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కీలకమైన పౌర విమానయాన శాఖను ఆయన దక్కించుకున్నారు. మరోవైపు తొలిసారిగా గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు సైతం కేంద్రమంత్రి పదవి వరించింది. మరోవైపు బిజెపి నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆయన నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఇప్పుడు కేంద్రమంత్రి పదవి ఏపీకి ఇస్తే మూడు పార్టీల్లో ఎవరికి అంటే.. టిడిపి మాటే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర నుంచి ఒకరు… కోస్తా నుంచి మరొకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఉన్నారు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవి ఇస్తే తప్పకుండా రాయలసీమకు చెందిన నేతకు కేటాయిస్తారు. జనసేనకు కేటాయిస్తే మచిలీపట్నం ఎంపీ ముందంజలో ఉంటారు. ఒకవేళ బిజెపి తీసుకుంటే మాత్రం పురందేశ్వరికి కానీ.. సీఎం రమేష్ కు కానీ అవకాశం ఉంది.
కృష్ణమూర్తి లేదా ప్రతిభా భారతి
అయితే తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్( Governor post) పోస్ట్ కేంద్రం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 2014లో కూడా ఇటువంటి ఆఫర్ తెలుగుదేశం పార్టీకి ఉండేది. కానీ అప్పటి రాజకీయాల పుణ్యమా అని 2018 లో ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు చంద్రబాబు. అయితే ఈసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు టిడిపి కీలక భాగస్వామి కావడంతో.. అధికారంలోకి వచ్చిన ఏడాదికే ఒక గవర్నర్ పోస్ట్ టిడిపికి ఇచ్చింది కేంద్రం. పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. అయితే ఇప్పుడు మరో గవర్నర్ పోస్ట్ ఆఫర్ చేస్తే ప్రముఖంగా యనమల రామకృష్ణుడు పేరు వినిపిస్తోంది. అయితే ఆయనకు రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. రాయలసీమకు చెందిన బీసీ నేత కేఈ కృష్ణమూర్తికి చాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆయన సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2014లో అయితే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు టిడిపి శాసనసభ్యుడిగా ఉన్నారు. కృష్ణమూర్తి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో ఆయనకే ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు ఎస్సీలకు ఇవ్వదలుచుకుంటే… మాజీ మంత్రి ప్రతిభా భారతికి అవకాశం ఇస్తారని సమాచారం. ఆమె స్పీకర్ గా కూడా గతంలో వ్యవహరించారు. జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య కుమార్తెగా సుపరిచితురాలు. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆమెకు గవర్నర్ పోస్ట్ లో నియమించడం ద్వారా సామాజిక సమీకరణకు పెద్దపీట వెయ్యోచ్చని చంద్రబాబు ఆలోచనగా సమాచారం. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.