Visakhapatnam: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతోంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం నడుస్తోంది. అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు సైతం నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఏ శాఖ పనితీరు ఆ శాఖ ముందుకెళ్తోంది. ఇంకోవైపు విశాఖకు దిగ్గజ ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా గూగుల్ డేటా ఏర్పాటుకు ముందుకు రావడం గేమ్ చేంజర్ గా మారింది. ఇదే ఊపుతో వచ్చే నెలలు విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోందన్న సంకేతాలు సామాన్య జనాలకు సైతం అందుతున్నాయి. చంద్రబాబుతో పాటు లోకేష్ దేశ విదేశాలకు తిరిగి పెట్టుబడులు తెస్తున్నారని విద్యాధికులు, ఏ పార్టీతో సంబంధం లేని వారు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
* ముగ్గురు మూడు బాధ్యతలు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో సంక్షేమమే అంతా నడిచింది. ఇటువంటి ప్రయత్నాలు ఏవి జరగలేదు. పైగా సంబంధిత మంత్రుల ప్రకటనలు సైతం భిన్నంగా ఉండేవి. దీంతో ప్రజలు కూడా ఈ విషయాల్లో ఇబ్బంది పడ్డారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. అధికారంలోకి వచ్చిన కూటమి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ముఖ్యంగా పల్లె పాలన, అభివృద్ధి వంటి అంశాలను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా బాధ్యత తీసుకున్నట్లు కనిపిస్తోంది. అమరావతి రాజధాని తో పాటు ఇతర పాలన వ్యవహారాలను చంద్రబాబు చూస్తున్నారు. విదేశీ వ్యవహారాలతో పాటు పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడ్డారు నారా లోకేష్. ఇలా ఈ ముగ్గురు ఒక్కో బాధ్యత తీసుకోవడం ద్వారానే 17 నెలల కాలంలో ఏపీలో అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* నేరుగా ముఖాముఖి..
గత కొద్దిరోజులుగా పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే.. చంద్రబాబుతో( CM Chandrababu) పాటు లోకేష్ తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. అయితే ఇక్కడే గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఎక్కడ ఎంఓయుల మాట లేదు. నేరుగా పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని వారికి వివరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను అక్కడే ప్రకటిస్తున్నారు. భూముల కేటాయింపు, సాధ్యాసాధ్యాలను సంబంధిత అధికారులతోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అందుకే చంద్రబాబు, లోకేష్ విదేశాలకు వెళ్తుంటే అక్కడ ప్రముఖ కంపెనీల్లో పనిచేసే భారతీయులు, ఏపీ వాసులు తప్పకుండా హాజరవుతున్నారు. కంపెనీల్లో కీలక భూమిక పోషించేవారు ఆ కంపెనీల యాజమాన్యాలను ఒప్పిస్తున్నారు. దీంతో వారు ఎంతో నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.
* సదస్సుపై భారీ అంచనాలు..
అయితే ఇప్పుడు అందరి దృష్టి విశాఖ( Visakhapatnam) పెట్టుబడుల సదస్సు పై ఉంది. భారీగా పారిశ్రామిక పెట్టుబడులు ఈ సదస్సు ద్వారా వస్తాయని అంతా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో పాటు లోకేష్ మాట్లాడడంతో చాలామంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యేందుకు వస్తున్నారు. వచ్చే నెల 14, 15వ తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందో.. నాటి నుంచే ఏపీ పెట్టుబడుల విషయంలో గేమ్ చేంజర్ గా మారింది. అప్పటివరకు ఏపీ పై ఉన్న ప్రతికూల వాదనలు, అంశాలు పక్కకు వెళ్లిపోయాయి.