AP MLC Election: ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 28న ఓటింగ్ జరగనుంది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఎన్నికల్లో శృంగవరపుకోట అసెంబ్లీ టికెట్ ను రఘురాజు ఆశించారు. కానీ జగన్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రఘురాజు కుటుంబ సభ్యులతో పాటు వైసిపి మెజారిటీ క్యాడర్ టిడిపిలోకి వెళ్లిపోయింది. అనర్హత వేటుపడుతుందని భావించి రఘురాజు సైలెంట్ అయ్యారు. అయితే ఎన్నికల అనంతరం టిడిపి ప్రజాప్రతినిధులతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు రఘురాజు. దీంతో వైసిపి మండలి చైర్మన్ మోసేన్ రాజుకు ఫిర్యాదు చేసింది. దీంతో రఘురాజు పై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు వెళ్లారు. కానీ ఇంతలో నోటిఫికేషన్ వచ్చింది. అయితే స్థానిక సంస్థలకు సంబంధించి విజయనగరం జిల్లాలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. అందుకే ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించింది. అధినేత జగన్ ఆ జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
* ఆ ఇద్దరి నేతల మధ్య పోటీ
అయితే ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఎన్నికలు జరగనుండడంతో అటు పార్వతీపురం మన్యం జిల్లా నేతలు కూడా కీలకం కానున్నారు. ప్రధానంగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంభంగి చిన్న వెంకట అప్పలనాయుడు, మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరి పేరు ఖాయంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఒకవేళ టిడిపి ప్రతిష్టాత్మకంగా భావిస్తే మాత్రం బొత్స కుటుంబం పోటీ చేసే అవకాశం ఉంది. అయితే టిడిపి నుంచి ఆశించిన స్థాయిలో ఆసక్తి కనిపించడం లేదు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాత్రం తమ అభ్యర్థిని పెడతామని చెబుతున్నారు. కచ్చితంగా గెలుస్తామని కూడా చెప్పుకొస్తున్నారు.
* వైసీపీకి స్పష్టమైన బలం
ఈనెల 11 వరకు నామినేషన్ల దాఖలకు సమయం ఉంది. అయితే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వైసిపి అప్రమత్తమయ్యింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీకి 548, టిడిపికి 168, ఇతరులకు 16 మంది బలం ఉంది. మొత్తం 753 మందికి గాను 548 మంది సభ్యులు బలం వైసీపీకి ఉన్న తరుణంలో.. ఆ పార్టీ సులువుగా ఈ స్థానాన్ని కైవసం చేసే అవకాశం ఉంది. అయితే ఒకవేళ కూటమి రంగంలోకి దిగినా… 380 మంది సభ్యుల మద్దతు కావాలి. అది ఏమంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే వైసీపీలో ఎమ్మెల్సీ స్థానానికి విపరీతమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అదే సమయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటనలు చూస్తుంటే పోటీ అనివార్యంగా మారినట్లు కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.