Tirupati Laddu: తిరుపతి అనగానే టక్కున గుర్తుకు వచ్చేది శ్రీవారి లడ్డు ప్రసాదం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు లడ్డూ ప్రసాదాన్ని విధిగా స్వీకరిస్తారు. అంతే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత బంధువులకు, తెలిసిన వాళ్లకు పంచుతుంటారు. కొందరైతే ఏకంగా లడ్డూల కోసం సిఫారసు లేఖలు సైతం తీసుకుంటారు. అటువంటి లడ్డు ప్రసాదం పై ఇటీవల వదంతులు పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరిగింది. ముఖ్యంగా లడ్డు పరిమాణం తగ్గిందని టాక్ నడిచింది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. లడ్డూ తయారు చేసే అర్చక బృందం ఈ విషయంపై స్పష్టత నచ్చింది.
కొద్దిరోజుల కిందట టీటీడీ అన్న ప్రసాదం నాణ్యత పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. కొందరు భక్తులు తినే అన్నం నాసిరకం కనిపించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇది పెను దుమారానికి దారితీసింది. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఘటనపై విచారణ చేపడతామని చెప్పుకొచ్చారు. తిరుమల చరిత్రలోనే అటువంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని.. మరోసారి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
ఆ ఘటన మరువకముందే శ్రీవారి లడ్డు ప్రసాదం పరిమాణం తగ్గిందని.. భక్తులకు విక్రయిస్తున్న లడ్డు ప్రసాదంలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని విమర్శలు వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియాలో సైతం ఇదే ప్రచారం జోరుగా సాగింది.ఈ నేపథ్యంలో లడ్డు తయారు చేసే వైష్ణవ బ్రాహ్మణులు స్పందించారు. లడ్డూ నాణ్యత తగ్గే అవకాశం లేదని తేల్చి చెప్పారు. కొన్ని తరాలుగా లడ్డు తయారీలో నైపుణ్యం సాధించామని చెప్పుకొచ్చారు. అటు తిరుమలలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో సైతం ఇదే విషయం చర్చ జరిగింది. దీంతో ఈ లడ్డూలు తయారు చేస్తున్నవారు సమావేశంలో స్పష్టతనిచ్చారు. తయారీలో వినియోగించే నెయ్యి, శనగపిండి, చక్కెర, ఎండు ద్రాక్ష, బాదం తదితర దినుసులను సక్రమంగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. దీంతో అధికారులు స్పష్టమైన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని కోరారు.