Annadata Sukhibhava: ఏపీ( Andhra Pradesh) రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ పథకం విషయంలో కీలక అప్డేట్ వచ్చింది. రెండో విడత నిధుల విడుదలకు సంబంధించి ఒక సమాచారం బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడు రెండో విడతకు సంబంధించి నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదలకు ముందుకు రావడంతో.. ఏపీ ప్రభుత్వం సైతం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 19న అటు కేంద్ర ప్రభుత్వం తో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి ₹7,000 రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
* మాట తప్పిన వైయస్సార్ కాంగ్రెస్..
గతంలో వైసీపీ( YSR Congress ) ప్రభుత్వం రైతు భరోసా పేరిట నిధులు జమ చేసేది. 15000 రూపాయలు అందిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అందులో సగం రూ.
7500 పంపిణీకి పరిమితం అయ్యారు. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో 6 వేల రూపాయల మొత్తాన్ని అందించేది. దానికి ఓ రూ.7500 జతచేస్తూ.. మొత్తం రూ.13,500 అందించేవారు. అయితే తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20 వేల రూపాయలను సాగు ప్రోత్సాహం కింద అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ ఏడాది ఆగస్టులో అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల నగదు తో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరో 5000 జమ చేస్తూ.. మొత్తం 7000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయగలిగారు. ఇప్పుడు రెండో విడత ఈనెల 19న కేంద్ర ప్రభుత్వంతో కలిపి 7000 జమ చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ నిధిని ఈనెల 19న విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని చెప్పారు. దీంతో ఏపీలో అన్నదాత సుఖీభవ కు గ్రీన్ సిగ్నల్ లభించినట్టే.
* పెరగనున్న లబ్ధిదారులు..
రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆగస్టులో మొత్తం 47 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమయ్యాయి. అయితే అప్పట్లో ఈ కేవైసీ చేయించుకొని వారి ఖాతాల్లో నిధులు జమ కాలేదు. మరోవైపు వివిధ సాంకేతిక కారణాలతో సైతం జమ కాలేదు. వాటికి పరిష్కార మార్గం చూపి అర్హులని నిరూపించుకుంటే రైతులందరికీ ఖాతాల్లో నిధులు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలామంది తమ సమస్యలను పరిష్కరించుకున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే దీనిపై ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఆగస్టులో అన్నదాత సుఖీభవ నిధుల విడుదల సమయంలో.. సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించారు. అభ్యంతరాలను సైతం స్వీకరించారు. ఈసారి కూడా గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నారు. వివిధ కారణాలతో పథకం అందకపోతే సరి చేసుకునే అవకాశాన్ని సైతం కల్పించనున్నారు.