Anil Kumar Skips Police Investigation: ఏపీ పోలీసులకు మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav) ఝలక్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు ఆయన లెక్క చేయలేదు. విచారణకు హాజరయ్యేది లేదంటూ తేల్చి చెప్పారు. ఏకంగా తనపై వేసిన కేసును కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా విచారణకు హాజరు కావాలా? లేదా? అనేది నిర్ధారణకు రానున్నారు. ఒక కేసులో విచారణకు పిలిచి.. మరో కేసులో అరెస్ట్ చేస్తారన్న భయం అనిల్ కుమార్ యాదవ్ ను వెంటాడుతోంది. ఆ అరెస్టును తప్పించుకునేందుకే ఆయన తాజాగా పోలీస్ విచారణకు రానట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచే కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
రాజకీయ దుమారం..
కొద్ది రోజుల కిందట నెల్లూరు జిల్లాలో( Nellore district) రాజకీయ దుమారం రేగింది. కోవూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నట్టు వివాదం నడిచింది. ఈ క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ తో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితం పై మాట్లాడి అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. అక్కడ కు కొద్దిగా ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అప్పట్లో ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనిల్ కుమార్ యాదవ్ ప్రశాంతి రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. ఆమెపై విమర్శలు చేశారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ పై పోలీసులకు కేసు నమోదు చేశారు. ప్రశాంతి రెడ్డి పై వ్యక్తిగత కామెంట్లు చేసినందుకు విచారణకు హాజరుకావాలని నోటీసులు అందించారు.
Also Read: రోజా అరెస్ట్ అప్పుడే.. మంత్రి క్లారిటీ!
ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు మేరకు..
తన పరువుకు సంబంధించి, ప్రతిష్టకు సంబంధించి.. తక్కువ చేసి మాట్లాడారంటూ ప్రశాంతి రెడ్డి( Prashanti Reddy) ప్రసన్నకుమార్ రెడ్డి తో పాటు అనిల్ కుమార్ యాదవ్ పై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రసన్న కుమార్ రెడ్డి నిన్ననే విచారణకు హాజరయ్యారు. ఆమె తనపై వ్యక్తిగత కామెంట్లు చేయడం వల్లే తాను విమర్శలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు ప్రసన్న కుమార్ రెడ్డి. అయితే విచారణ అనంతరం ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. అయితే ఈరోజు అదే కేసు విచారణకు రావాలని అనిల్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఆపై తనపై పోలీసులు నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అనిల్ కుమార్ యాదవ్. ప్రస్తుతం కోర్టు ఆదేశాల కోసమే ఆయన ఎదురుచూస్తున్నారు. అందుకే విచారణకు హాజరు కాలేదని తెలుస్తోంది.
మైనింగ్ కేసులో అరెస్టు చేస్తారని..
అయితే అనిల్ కుమార్ యాదవ్ ఈ కేసు విచారణ విషయంలో భయపడడం లేదు. ఈ కేసు విచారణకు పిలిచి క్వార్జ్ మైనింగ్( quarrej mining ) కుంభకోణం కేసులో అరెస్టు చేస్తారని ఎక్కువగా భయపడుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. మరో కీలక వ్యక్తి సైతం అరెస్టు కావడం.. ఆయన సైతం విచారణలో అనిల్ పేరు చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ కు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ప్రశాంతి రెడ్డి కేసు విషయంలో పిలిచి తనను అరెస్టు చేస్తారని అనిల్ అనుమానిస్తున్నారు. ఆ అనుమానంతోనే నేటి విచారణకు డుమ్మా కొట్టారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.