Andhra Pradesh Youth: ఉద్యోగాల( employment) విషయంలో ఒక సంస్కృతి నడుస్తోంది. ఉన్న ఊరిలో ఉన్న పరిశ్రమలో పనిచేసేందుకు యువత ముందుకు రావడం లేదు. చిన్నాచితక నగరాల్లో పని చేసేందుకు సైతం ఆసక్తి చూపడం లేదు. కేవలం మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే ఉండే పరిశ్రమల్లో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాలకు వెళ్లి ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉద్యోగాలు ఉన్న వద్దని చెబుతున్నారు. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనిషి జీవన విధానం మారడం వల్లే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. భారీగా వేత్తనాలు ఒక ఎత్తు అయితే.. విలాసవంతమైన జీవితం మరో ఎత్తు.
* అప్పుడే వివాహ ప్రయత్నాలు..
సాధారణంగా ఒక యువకుడు ఉద్యోగం చేశాడు అంటే ఆ కుటుంబం అతడికి వివాహం చేయాలని భావిస్తుంది. అయితే సాధారణ పట్టణాలతో పాటు నగరాల్లో ఉద్యోగం చేసే వారికి వివాహ సంబంధాలు దొరకడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అందరి అభిరుచులు మారాయి. తాను చేసుకోబోయే వ్యక్తి మెట్రోపాలిటన్ నగరాల్లో పనిచేస్తేనే అన్నట్టు వ్యవహరిస్తున్నారు నేటి యువతులు. వారి కన్నవారి సైతం తమ అల్లుడు మెట్రోపాలిటన్ నగరాలతో పాటు విదేశాల్లో ఉంటేనే అన్నట్టు చూస్తున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఉద్యోగంతో పాటు వివాహానికి ఎక్కువగా మెట్రోపాలిటన్ నగరాలకు వెళ్తున్నారు యువకులు.
* ఆ నగరాల్లోనే అధికం
ఆంధ్రప్రదేశ్ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన ఏ ఉద్యోగి స్థానికంగా పనిచేయడం చాలా తక్కువ. మీ బాబు ఎక్కడ పని చేస్తున్నాడు అంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు హైదరాబాద్, బెంగళూరు అని పేర్లు చెబుతుంటారు. చెన్నై తో పాటు ముంబై, ఢిల్లీ అని సమాధానం ఇస్తుంటారు. చివరకు వివాహ పరిచయ వేదికల్లో సైతం ఈ మెట్రోపాలిటన్ నగరాలు అని ఉంటేనే అమ్మాయి తరఫు బంధువులు మొగ్గు చూపుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉద్యోగాలను నిర్దేశిస్తుంది వివాహ వ్యవస్థ. అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అంటే తల్లిదండ్రులు వెంటనే వివాహ ఆలోచన చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడినవారు తమవారు కూడా మెట్రోపాలిటన్ నగరాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఉద్యోగంలో ఇదో రకమైన సంక్షోభం అన్నమాట.