Andhra Pradesh Weather Update: ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఒకవైపు పెరుగుతున్నాయి. మరోవైపు ఆకాశం మేఘావృతం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు కొనసాగుతోంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈరోజు అల్పపీడనంగా బలహీనం కానుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతున్న తరుణంలో ఈ వర్షాలు కలిగించాయి. మంగళ బుధవారాల్లో సైతం ఈ వర్షాలు కొనసాగనున్నాయి. మరోవైపు పలుచోట్ల పిడుగులతో కూడిన వానలు పడవచ్చు అని వాతావరణ శాఖ చెబుతోంది. రైతులు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
* సాలూరులో భారీ వర్షం..
ఏపీవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సోమవారం వర్షాలు పడ్డాయి. పార్వతీపురం మన్యం( parvatipuram manyam ) జిల్లా సాలూరులో సోమవారం సాయంత్రం భారీ వర్షం పడింది. ఈదురు గాలులు కూడా వీచాయి. ఒక్కసారిగా వాతావరణం లో మార్పులతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొనసాగగా.. సాయంత్రానికి ఒక్కసారిగా వర్షం కొరవడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురిసాయి.
* అమాంతం పెరిగిన ఉష్ణోగ్రతలు..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. కొద్దిరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు( temperatures ) పెరిగాయి. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు పెరిగాయి. కాకినాడ జిల్లా తుని, కృష్ణాజిల్లా మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురంలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 34 డిగ్రీలకు దాటాయి. కర్నూలులో అత్యధికంగా 36.2, అనంతపురంలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు అప్పుడే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నడి వేసవిని ఊహించుకుని ఆందోళన చెందుతున్నారు.