Andhra Pradesh Politics: దేశంలో అక్టోబర్ తర్వాత రాజకీయ మార్పులు జరగనున్నాయా? జాతీయస్థాయిలో కొత్త సమీకరణలు తెరపైకి రానున్నాయా? ఏపీ పాలిటిక్స్ లో సైతం పెను మార్పులు తప్పవా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. ఈ ఏడాది అక్టోబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు( Bihar Assembly Elections ) జరగనున్నాయి. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. అధికారంలోకి వచ్చేందుకు ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఎన్నికల సంఘం అక్కడ నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితాల సవరణ కూడా పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాలు ఈ దేశంలో రాజకీయ మార్పుకు కారణం అవుతాయని విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఎన్డీఏలో ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ, బీహార్ నుంచి జెడియు కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవేళ బీహార్లో ఎన్డీఏ ఓడిపోతే మాత్రం ఏపీలో ప్రభావం చూపడం ఖాయం.
Also Read: ఏపీలో ఒక్కో విద్యార్థికి రూ.లక్ష.. ఎలా అంటే?
ఓడిపోతే ఒత్తిడి..
ప్రస్తుతం ఏపీలో టిడిపి( Telugu Desam Party) నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. ఇదే టిడిపి కేంద్రంలోని ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. అయితే బీహార్లో మరో ప్రధాన భాగస్వామ్య పక్షమైన జేడీయు ఓడిపోతే తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ గ్రాఫ్ తగ్గుతోందన్న అంచనాలు వెలువడుతున్న క్రమంలో.. బీహార్లో ఎన్డీఏ కూటమి ఓడి.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు పునరాలోచనలో పడే పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి బీహార్లో నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దానిని అధిగమించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది పెను సవాల్ గా మారుతుంది. అందుకే ఈసీ సాయంతో ఓటరు జాబితాలో పేర్లు తొలగించి ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇది ఎన్నికల ఫలితం పై ప్రభావం చూపుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
చంద్రబాబులో పునరాలోచన..
ఒకవేళ బీహార్లో ఎన్డీఏ కూటమి ఓడిపోతే.. నితీష్ కుమార్( Nitish Kumar) వల్లేనని బిజెపి తప్పుకునే అవకాశం ఉంది. అదే జరిగితే నితీష్ కుమార్ బిజెపిని వీడటం ఖాయం. దాంతో చంద్రబాబు సైతం ఆలోచనలో పడతారు. బిజెపికి ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం ఎన్డీఏ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తారు. అయితే ఎన్డీఏకు మాత్రం గుడ్ బై చెప్పే ఛాన్స్ లేదు. అయితే ఈ పరిస్థితిని గమనిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి మద్దతు కోరిన వెంటనే జై కొట్టింది. బిజెపి బలపరిచిన అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అలా వ్యవహరించి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది.
Also Read: ఉత్తరాంధ్ర పై జనసేన ఫోకస్!
జగన్ అనుమానం అదే..
మరోవైపు జగన్మోహన్ రెడ్డిలో( Y S Jagan Mohan Reddy ) సైతం ఒక రకమైన అనుమానం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చంద్రబాబు టచ్ లోకి వెళ్లినట్లు జగన్మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఓట్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీ గట్టిగానే పోరాడుతున్నారు. అధికార యాత్ర చేపట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు. ఒకవేళ ప్రతిపక్షాలు గట్టిగా ప్రయత్నిస్తే బిజెపి పతనం ఖాయం. అయితే అక్టోబర్లో బీహార్ ఎన్నికల ఫలితాల్లో తేడా కొడితే మాత్రం.. ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.