Andhra Pradesh Investments: ఏపీ ప్రభుత్వం( AP government ) పనితీరు ప్రస్తావన జాతీయస్థాయిలో మరోసారి చర్చకు వచ్చింది. పెట్టుబడులను ఆకర్షించడంలో ముందు వరుసలో నిలిచిన ఏపీ జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే ప్రముఖ మేగజైన్ ఫోర్బ్స్ తన బిజినెస్ ఎడిషన్ లో దీనిని ప్రచురించింది. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ పెట్టుబడులను ఆకర్షించింది. 2025 ఏప్రిల్ – డిసెంబర్ వరకు భారతదేశ వ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో పావలా శాతం ఏపీనే రాబట్టుకుందంటే ఏ స్థాయిలో వృద్ధి సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ ప్రత్యేక కథనం ప్రచురించడం విశేషం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామిక్ డేటా ఆధారంగా ఈ కథనం ఉంది.
* అనువైన ప్రాంతం కాకున్నా..
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పెట్టుబడులకు అనువైన ప్రాంతం కాదు. ముఖ్యంగా తమిళనాడు( Tamil Nadu ), కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు పరిశ్రమలు పెట్టేందుకు అనుకూలమైనవిగా భావిస్తారు పారిశ్రామికవేత్తలు. ఆపై పెద్ద రాష్ట్రం గా ఉత్తరప్రదేశ్ ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం రాయితీలు కల్పించడం, పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిరంతరం పెట్టుబడుల కోసం అన్వేషిస్తున్నారు.. విదేశాలకు వెళ్లి పారిశ్రామికవేత్తలను కలిశారు. దావోస్ ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యారు. విశాఖలో ప్రభుత్వమే నేరుగా పెట్టుబడుల సదస్సు నిర్వహించింది. ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వడంతోనే ఏపీ ఈ ఘనత సాధించింది.
* సింహ భాగం మనదే..
గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా రూ. 26.6 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు జరిగాయి. ఇందులో 25.3% వాటాను ఏపీ దక్కించుకుంది. తరువాత స్థానంలో ఒడిస్సా 13.1% పెట్టుబడులను ఆకర్షించగలిగింది. దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై మహారాష్ట్ర 12.8% పెట్టుబడులను దక్కించుకుంది. దేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడుల్లో సగానికి పైగా అంటే 51.2% వాటాలను ఈ మూడు రాష్ట్రాలే ఆకర్షించాయి. అందులో 25% వాటా ఏపీకే రావడం గమనార్హం.
* రాజకీయంగా అనుకూలం..
దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) స్పందించారు. పెట్టుబడుల విషయంలో ఏపీ అగ్రస్థానంలో నిలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. మంత్రి నారా లోకేష్ సైతం హర్షం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు ప్రయత్నాలతోనే ఏపీ ఈ ఘనత సాధించిందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. వైసిపి హయాంలో పరిశ్రమలు రాలేదన్న విమర్శ ఉంది. ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కూటమి చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చినట్లు కనిపిస్తున్నాయి. మొత్తానికి రాజకీయంగా కూడా కూటమి ప్రభుత్వానికి ఇది గొప్ప అంశంగానే చెప్పవచ్చు.